సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు? | - | Sakshi
Sakshi News home page

సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు?

Jul 11 2025 6:07 AM | Updated on Jul 11 2025 6:07 AM

సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు?

సమగ్ర నివేదికలు లేకుండా ఎలా వస్తారు?

సాక్షి, ఆసిఫాబాద్‌: జిల్లా అధికారులు సమగ్ర నివేదికలు లేకుండానే ‘దిశ’ సమావేశానికి ఎలా హాజరవుతారని ఎంపీ గోడం నగేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ) సమావేశానికి ఎంపీ హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మైనింగ్‌, విద్య, వైద్య, వ్యవసాయ, బీఎస్‌ఎన్‌ఎల్‌. గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలో ప్రస్తుతం అమలులో ఉన్న పథకాల పురోగతిపై ఆయా శాఖల వారీగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 137 అంగన్‌వాడీ టీచర్లు, 357 ఆయా పోస్టులు ఖాళీలుగా ఉన్నాయన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లల చదువు, ఆరోగ్యంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తిర్యాణి మండలం గోవేన గ్రామ పంచాయతీలో విద్యుత్తు సరఫరా లేని ఆవాస ప్రాంతాలకు వెంటనే విద్యుత్తు సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అధికారులపై అసంతృప్తి...

దిశ సమావేశంలో పలు శాఖల అధికారులపై ఎంపీ నగేశ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో గతేడాది, ప్రస్తుత ఏడాదిల్లో ఎలాంటి పనులు చేపట్టారని, ఎంత మందికి పని దినాలు కల్పించారని, ఎన్ని నిధులు వ్యయం చేశారని ప్రశ్నించగా.. ఆ శాఖ పీడీ నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద ఎన్ని సీసీరోడ్లు, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మిస్తున్నారు? సీసీరోడ్లకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, ఇన్‌చార్జి మంత్రి నుంచి ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయని ప్రశ్నించారు. సీసీ రోడ్ల మంజూరులో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఏదైనా అడిగితే జిల్లా ఇన్‌చార్జి మంత్రి వద్ద నుంచి సిఫార్సు తీసుకురావాలని చెబుతున్నారని, మీరు కూడా ఇన్‌చార్జి మంత్రి నుంచి సిఫార్సు తెస్తున్నారా? అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ఈ అంశంపై ఎంపీ గోడం కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. అందరికీ సమానంగా పనులు ఇవ్వాలని సూచించారు. అధ్వానంగా మారిన రోడ్లకు ఎందుకు మరమ్మతులు చేపట్టడం లేదని ఆర్‌అండ్‌బీ, పంచాయరాజ్‌ శాఖల అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా దెబ్బతిన్న తిర్యాణి రోడ్డు గురించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి తెలుపగా.. ఆ రహదారి పనులు చేపట్టేందుకు అటవీశాఖ నుంచి అనుమతులు ఇవ్వడం లేదని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ పేర్కొన్నారు. అక్కడే ఉన్న డీఎఫ్‌ఓ నీరజ్‌కుమార్‌ దానిని ఖండిస్తూ ఆ రహదారి విషయంపై నాకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని సమాధానం ఇచ్చారు. వారిరువురి మధ్య సంభాషణ కొనసాగుతుండగా ఎంపీ కలుగజేసుకుని వెంటనే తిర్యాణి రహదారి పనులు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ, డేవిడ్‌, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎంపీ గోడం నగేష్‌

కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిపై సమీక్ష

పలు శాఖల అధికారులపై అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement