
దిందా వాగులో పడి యువకుడు గల్లంతు
చింతలమానెపల్లి: దిందా వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. కేతిని గ్రామానికి చెందిన సెడ్మెక సుమన్(18) సుమన్ తన స్నేహితులతో కలిసి గురువారం దిందా వాగుకు అవతలి వైపు ఉన్న వ్యవసాయ భూముల వద్దకు వెళ్లాడు. ఈక్రమంలో వారు వాగు దాటేందుకు ప్రయత్నించారు. సుమన్‌కు ఈతవచ్చినప్పటికీ అవతలివైపు చేరుకునే సమయంలో వాగు ఉధృతి పెరిగింది. సుమన్ గట్టుపై ఉన్న చెట్టును పట్టుకోగా చెట్టుకొమ్మ విరిగింది. దీంతో వాగు ఉధృతిలో కొట్టుకుపోయాడు. స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం, చీకటి పడడంతో సహాయక చర్యలు చేపట్టలేకపోయారు. గల్లంతైన సుమన్ డిగ్రీలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. డైట్ సెట్ పరీక్షకు హాజరయ్యాడు. తిరుపతి అమృత దంపతులకు సుమన్ పెద్దకుమారుడు. మరో అజయ్, కిషన్, కల్పన సంతానం ఉంది.