
ఉమ్మడి కుటుంబం..ఆత్మీయం
తాంసి: మండల కేంద్రానికి చెందిన జానకొండ శ్రీకాంత్ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సయ్య–లక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహం అనంతరం కొన్నేళ్లకు తండ్రి నర్సయ్య మృతిచెందాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ అన్నీతానై కుటుంబ బాధ్యతలను తనపై వేసుకుని ముందుకు నడిపించాడు. కుటుంబం కోసం వ్యాపారం ప్రారంభించి, తమ్ముడు అశోక్‌ను ఉన్నతంగా చదివించాడు. అన్న కష్టానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ప్రస్తుతం సాత్నాల మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. సివిల్స్‌కు సన్నద్ధమై ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. ఇటీవల గ్రూప్–2 ఫలితాల్లో రాష్ట్రస్థాయి 250వ ర్యాంక్, గ్రూప్–3లో 417 ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం తల్లితోపాటు వివాహమైనప్పటికి సోదరులు ఇద్దరు ఉమ్మడిగా ఉంటున్నారు. నలుగురు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు, తల్లి మొత్తం తొమ్మిది మంది ఒకే చోట ఉంటున్నారు.