
వాన జోరు.. వరద హోరు!
● జిల్లా అంతటా ఎడతెరిపిలేని వర్షం ● పొంగిపొర్లుతున్న వాగులు, ఒర్రెలు ● ఉప్పొంగిన ప్రాణహిత ● నీటమునిగిన పంటలు
ఆసిఫాబాద్/కెరమెరి/చింతలమానెపల్లి/దహెగాం/పెంచికల్‌పేట్/బెజ్జూర్/సిర్పూర్(టి)/కౌటాల:
జిల్లా అంతటా రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు కుమురంభీం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేశారు. జిల్లా కేంద్రంలోని పైకాజీనగర్‌లోని లోతట్టు ప్రాంతంలో వర్షపు నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆసిఫాబాద్ మండలంలోని అప్పపల్లి వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచి పోయి ఆర్‌ఆర్‌కాలనీ వాసులు ఇబ్బందిపడ్డారు. కెరమెరి మండలంలోని లక్మాపూర్, అనార్‌పల్లి వా గులు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. సుమారు 15 గ్రామాలకు చెందిన ప్రజలు వాగు దాటి రాలేకపోతున్నారు. సాంగ్వి కల్వర్టుపై నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. చింతలమానెపల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గురువారం 51.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బాబాసాగర్ నాయకపుగూడ దారిలో వాగు ఉప్పొంగడంతో రవాణా నిలిచిపోయింది. పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కౌ టాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో రవా ణా స్తంభించింది. గూడెం వద్ద అంతర్రాష్ట్ర వంతెన శ్లాబ్‌ను తాకేలా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. పలు పాఠశాలల ఆవరణలోకి వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నా యి. బూరెపల్లి, రణవెల్లి గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు కొనసాగుతున్నందువల్ల వాగుల ఉధృతి కొనసాగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దహెగాం మండలంలోని ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో మొట్ల గూడ, రావులపల్లి, రాంపూర్ శివారులో 3 నుంచి 4వందల ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. పెంచికల్‌పేట్ మండలంలోని కొండపల్లి–గొల్లవాడ మధ్య ఒర్రె ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తా త్కాలిక రోడ్డు కొట్టుకు పోయింది. బొక్కివాగు, ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అనిల్ కుమార్ సూచించారు. బెజ్జూర్ మండలంలో ప్రాణహిత న ది ఉప్పొంగి సోమిని, తలాయి, తిక్కపల్లి, భీమా రం, ఇప్పలగూడ, మొగవెళ్లి, తదితర గ్రామాల్లో పంటపొలాలు నీటమునిగాయి. కృష్ణపల్లి, సుస్మిర్ సమీపంలోని రెండు ఒర్రెలు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిర్పూర్(టి) మండలంలో వెంకట్రావ్‌పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర హైలెవల్ వంతెనకు ఆనుకోని పెన్‌గంగ నది వరద నీరు ఉదృతంగ ప్రవహిస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే తెలంగాణ–మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండటంతో నదీ తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి సమీపంలోని ప్రాణహితనది, తాటిపెల్లి వద్ద వార్థానది, గుండాయిపేట సరిహద్దులోని పెనగంగ నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.
కెరమెరి: సాంగ్వి కల్వర్టుపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు

వాన జోరు.. వరద హోరు!

వాన జోరు.. వరద హోరు!

వాన జోరు.. వరద హోరు!

వాన జోరు.. వరద హోరు!