
దిందాలో మళ్లీ పోడు రగడ
చింతలమానెపల్లి(సిర్పూర్): మండలంలోని దిందా గ్రామంలో మళ్లీ పోడు రగడ చోటు చేసుకుంది. దిందా శివారులోని బందెపల్లి బీట్ వద్దకు మంగళవారం ఆయా రేంజ్‌లకు చెందిన అధికారులు చేరుకున్నారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టారు. కొంతమేరకు మొక్కలు నాటగా.. విషయం తెలుసుకున్న పోడు రైతులు, మహిళలు అక్కడికి చేరుకున్నారు. అటవీశాఖ ఉన్నతాధికారులు గతంలో తమకు భూములు ఇస్తామని ప్రకటించారని, ఏకపక్షంగా అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరో పించారు. తమ పొట్టకొట్టేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో మొక్కలు నాటేందుకు వెళ్తున్న అధికారులు, సిబ్బందిని అడ్డుకున్నారు. కొంతమేర మొక్కలు నాటిన అనంతరం అధికారులు వెనుదిరిగారు.