
వసతిగృహాల్లో శుభ్రత పాటించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): వసతిగృహాల్లో శుభ్రత పాటించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. మండలంలోని వసతి గృహాలు, గిరిజన పాఠశాలలు, లింబుగూడలోని మల్టీపర్పస్ సెంటర్, మండల ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీవో మాట్లాడుతూ నాణ్యమైన విద్యతోపాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారం అందించాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ విద్యార్థికి చదవడం, రాయడం రావాలన్నారు. మండల ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుడు వినయ్ ఉప్రేను ఆదేశించారు. మల్టీ పర్పస్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెయింటింగ్, మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. వారి వెంట డీటీడీవో రమాదేవి, వివిధ శాఖల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.