
18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు, సెర్ప్ ఏపీఎంలు, డీపీఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 వరకు ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించేందుకు అధికారులు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 8వ తేదీన ప్రతీ మండలంలో మండల సమాఖ్య సభ్యులు, 9న గ్రామ సమాఖ్య సభ్యులతో సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే ప్రమాదబీమా, రుణబీమా వర్తింపజేస్తుందన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు, సోలార్‌ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, చేపల పెంపకం, పెరటి కోళ్ల పెంపకం, పాల డెయిరీలను ఏర్పాటు చేస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మహిళా శక్తి భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 22 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొనుగోలు చేయగా, రూ.20 లక్షల కమీషన్ వచ్చిందని వెల్లడించారు. 446 అమ్మ ఆదర్శ పాఠశాలల్లో రూ.7.82 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఏకరూప దుస్తులు అందించడంలో మహిళా సంఘాల కృషి అభినందనీయమన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, కార్యదర్శి వనిత, కోశాధికారి కుసుమ, గౌరవ అధ్యక్షురాలు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే