
సమస్యల వెల్లువ
● ప్రజావాణికి తరలివచ్చిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అర్జీలు స్వీకరించి బాధితులకు భరోసా కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్ మండలం అందవెల్లికి చెందిన జెల్లా వాణి, చింతలమానెపల్లి మండలం బాబాపూర్‌కు చెందిన పుణ్యపురెడ్డి కవిత, ఆసిఫాబాద్ మండలం నూర్‌నగర్‌కు చెందిన ఫర్జానా బేగం వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. వితంతు పింఛన్ ఇప్పించాలని కాగజ్‌నగర్ మండలం చింతగూడకు చెందిన డి.శాంత విన్నవించింది. ఆసిఫాబాద్ మండలంలోని బూర్గుడలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లే దారిని కొంతమంది ఆక్రమించుకున్నారని, విచారణ చేపట్టి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. కోసిని గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక నిర్మాణ పనులు పూర్తి చేశానని, బిల్లులు ఇప్పించాలని చింతలమానెపల్లి మండలం గంగాపూర్‌కు చెందిన దంద్రె శ్రీధర్ కోరాడు. వంశపారపర్యంగా వచ్చిన పట్టా భూమిని కొందరు ఆక్రమించుకుని పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టి న్యాయం చేయాలని ఆసిఫాబాద్ మండలం పర్శనంబాలకు చెందిన తానుబాయి కోరింది. తనకు తెలియకుండా పట్టా భూమిని వేరే వ్యక్తులు పట్టా మార్చుకున్నారని, విచారణ చేపట్టాలని తిర్యాణి మండలం కోయతలండికి చెందిన పెట్టం రాజలింగు కోరాడు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పెంకుటింట్లో ఉంటున్నాం
నేను నిరుపేదరాలిని. పెంకుటింట్లో ఇబ్బందిగా కాలం వెల్ల దీస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కోసం గతంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికై నా ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
– దుప్ప శాంత,
చింతగూడ, మం.కాగజ్‌నగర్
ఉద్యోగం ఇప్పించాలి
మా తండ్రి పైకురావును 1990లో మావోయిస్టులు హత్య చేశారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ఉద్యోగావకాశం కల్పించింది. నాకు ఇప్పటివరకు ఎలాంటి ఉద్యోగం కల్పించడం లేదు. నా వయస్సు దాటిపోయి, నా కుమారుడు మేజర్ అయినప్పటికీ స్పందన లేదు. నాకుగానీ.. కుమారుడికిగానీ అర్హత ప్రకారం ప్రభుత్వ ఉద్యోగం కల్పించి పరిహారం చెల్లించాలి.
– కొట్నాక కిషన్‌రావు, గుందాడ, మం.వాంకిడి

సమస్యల వెల్లువ

సమస్యల వెల్లువ