
కొత్తరూపు!
రహదారులకు
● ‘హామ్’ పథకం కింద జిల్లా రోడ్లకు మహర్దశ ● తొలిదశలో 308.13 కిలోమీటర్ల వరకు అభివృద్ధి ● ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఆర్‌అండ్‌బీ, పీఆర్ శాఖలు ● డీపీఆర్ రూపకల్పనకు రంగంలోకి దిగిన కన్సల్టెన్సీ సంస్థ
సాక్షి, ఆసిఫాబాద్: అడుగు లోతు గుంతలు.. కంకర తేలిన రహదారులు.. ఇదీ జిల్లాలోని చాలా మార్గాల్లో రోడ్ల పరిస్థితి. త్వరలో ఈ రహదారులకు మహర్దశ పట్టనుంది. ‘హామ్’(హైబ్రిడ్ యూన్యుటీ మోడ్) పథకంతో గుంతలు, కంకర తేలిన రహదారులు సరికొత్త రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవైన పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. వాటికి సంబంధించిన పనులను సర్వే చేసి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్(డీపీఆర్) రూపకల్పన కోసం ఓ ప్రైవేట్ కన్సెల్టెన్సీ సంస్థకు సర్కారు అప్పగించినట్లు తెలుస్తోంది. సదరు డీపీఆర్ ఆధారంగా సింగిల్ లేన్ రహదారులను రెండు లేన్లు, కంకర రోడ్లను తారు రోడ్లుగా మార్చనున్నారు.
ఆర్‌అండ్‌బీ రహదారులు అప్‌గ్రేడ్..
జిల్లా పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలిదశలో భాగంగా 308.13 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్లను నూతనంగా నిర్మించనున్నారు. కిలోమీటరు సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో నెలరోజుల్లో టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. జిల్లా రహదారులు, భవనాల శాఖ(ఆర్‌అండ్‌బీ) పరిధిలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రం నుంచి మండల కేంద్రానికి, గ్రామం నుంచి మండల కేంద్రానికి రహదారులను విస్తరించనున్నారు. మూడు విభాగాల్లో ఇప్పుడున్న రహదారులను రెండు, నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. జిల్లా పరిధిలోని 122.3 కిలోమీటర్ల పొడవున రహదారులను నవీకరించనున్నారు. ఇందులో ఉట్నూర్– ఆసిఫాబాద్ 68 కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.68 కోట్లు వెచ్చించనున్నారు. అలాగే ఆసిఫాబాద్ నుంచి సిర్పూర్(టి) 28.8కిలో మీటర్ల పొడవున ఉన్న రోడ్డు కోసం సుమారు రూ.29 కోట్లు, సిర్పూర్– మకోడి మార్గంలో 10.5 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.11 కోట్ల వరకు, కల్వడ– వడ్డుగూడ 15 కిలోమీటర్ల రహదారి పనులకు రూ.15 కోట్లు వ్యయం కానుంది.
పంచాయతీ రోడ్ల అభివృద్ధి ఇలా..
ఇక జిల్లాలో పంచాయతీరాజ్ మంచిర్యాల సర్కిల్ పరిధిలో వచ్చే రహదారుల విషయానికి వస్తే.. ఈ రహదారులను మూడు దశల్లో అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. మొత్తం మూడుదశల్లో 139 రహదారులను 633.90 కిలోమీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించడానికి ప్రతిపాదించారు. తొలిదశలో భాగంగా ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గాల పరిధిలోని 34 రోడ్లకు సంబంధించి 185.83 కిలో మీటర్ల పొడవున రహదారులు నిర్మించనున్నారు. ఇందులో ప్రధానంగా వీవీపీ రోడ్డు నుంచి బహ్లాన్‌పూర్ వరకు 22 కిలోమీటర్ల రహదారిని నవీకరించనున్నారు. అలాగే దాంపూర్ నుంచి అర్జున్‌లొద్ది వయా గిన్నెధరి, గాడలపల్లి రహదారిలో 13.4 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. రెండోదశలో 44 రహదారుల్లో 224.20 కిలోమీటర్ల వరకు, ఆ తర్వాత మూడో దశలో 61 రహదారుల్లోని 223.80 కిలోమీట్లర పొడవున రోడ్లు నవీకరించనున్నారు.
మూడు దశల్లో అభివృద్ధి
జిల్లా పరిధిలో ‘హామ్’ పథకం కింద మొదటిదశలో 185.83 కిలోమీటర్ల పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలోని రహదారులను అప్‌గ్రే డ్ చేయనున్నాం. మొత్తం మూడు దశల్లో 139 మార్గాల్లో 633.90 కిలోమీటర్ల వరకు నూతన రహదారులను నిర్మించనున్నాం. ‘హామ్’ పథకంతో జిల్లాలోని రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి.
– అజ్మీరా కృష్ణ, పీఆర్ ఎస్‌ఈ