
సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉండాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి పరిధిలో పరిష్కరించే డిమాండ్లు లేనందున ఈ నెల 9న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంస్థ ఉద్యోగులు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వగా, ఈ సమ్మెలో అధికశాతం డిమాండ్లతో సింగరేణి కార్మికులకు ఏ మాత్రం సంబంధం లేదని తెలిపారు. సంస్థ పరిధిలో లేని సమస్యల కోసం సమ్మెకు వెళ్లడం సరికాదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తితోపాటు ఓబీ వెలికితీతలో వివిధ కారణాలతో వెనుకబడి ఉన్నామని పేర్కొన్నారు. జూలై, ఆగస్టులో వర్షాల ప్రభావంతో ఓసీపీల్లో ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలగనుందని, వార్షిక లక్ష్య సాధనకు కార్మికులు సహకరించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఒక రోజు రూ.76 కోట్ల ఉత్పత్తి జరుగుతుందని, కార్మికులు వేతనాల రూపంలో రూ.13.07 కోట్లు నష్టపోతారని ఆయన తెలిపారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, డీవైపీఎం రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.