
బస్సుకోసం గంటలకొద్దీ నిరీక్షణ
చింతలమానెపల్లి: ప్రజా రవాణా వ్యవస్థలో కీలకమైన ఆర్టీసీ ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతోంది. సమయపాలన పాటించని బస్సులు, వసతులు లేక ఆర్టీసీ బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మహారాష్ట్ర సరిహద్దులో గూడెం గ్రామం ఉంది. ఆదివారం మండల కేంద్రానికి, పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పలువురు చిన్నారులు గూడెంలో బస్సులు నిలిపే ప్రాంతానికి చేరుకున్నారు. ఒకవైపు వర్షం మరోవైపు బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రావాల్సిన సమయానికి బస్సు రాకపోవడంతో 40 మందికి పైగా ప్రయాణికులు కొన్ని గంటలపాటు రోడ్డుపైనే వేచిఉన్నారు. గూడెంలో ప్రయాణ ప్రాంగణం నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.