● ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత
● సమయానికి రాని డాక్టర్లు ● జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలోనూ సేవలు అంతంతే.. ● పోస్టులు భర్తీ చేస్తేనే ప్రయోజనం
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: వర్షాలు ముసురుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలు తున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత ఇబ్బందికరంగా మారింది. ఉన్నవారు కూడా సకాలంలో విధులకు హాజరుకావడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లోని పీహెచ్‌సీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. గర్భిణులు స్కానింగ్ కోసం ఆసిఫాబాద్, ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు అర్బన్ పీహెచ్‌సీలు, ఐదు సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 44 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా కేవలం 27 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులను ‘సాక్షి’ విజిట్ చేయగా, అనేక సమస్యలు వెలుగుచూశాయి.
తీరుమారని జిల్లా ఆస్పత్రి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి స్థాయి మారి నా తీరు మారడం లేదు. 50 నుంచి వైద్యకళాశాలకు అనుబంధంగా 330 పడకల స్థాయికి పెరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్‌తో పాటు 95 మంది వైద్యులు సేవలందించాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. ముగ్గురు రెగ్యులర్ కాగా, తొమ్మిది మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 600 మంది ఔట్ పేషెంట్లు నమోదవుతుండగా, పదుల సంఖ్య లో ఇన్‌పేషెంట్లుగా చేరుతున్నారు. గతంలో ప్రతినెలా సుమారు 40 కాన్పులు జరిగేవి. గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు మంచిర్యాల మాతాశిశు కేంద్రం, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రసవాల సంఖ్య 15 నుంచి 20కి తగ్గింది. కార్డియాలజిస్టు అందుబాటులో లేరు. మంచిర్యాల, కరీంనగర్‌కు రోగులను రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు కూడా కేవలం ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు.
పెచ్చులూడుతున్న పెంచికల్‌పేట్ పీహెచ్‌సీ
పెంచికల్‌పేట్: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ భవనం స్లాబ్ పెచ్చులూడుతోంది. ఇటీవల వర్షాలకు స్లాబ్ నుంచి వర్షపు నీరు కారుతోంది. ప్రతిరోజూ సుమారు 80 నుంచి వంద మంది రోగులు వైద్యం కోసం వస్తున్నారు. వర్షపు నీరు కారుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది లేక ఇబ్బంది
కెరమెరి: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఉదయం 9:30 గంటలకు కేవలం పీఎం జన్‌మన్ జీఎన్‌ఎం మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత స్టాఫ్ నర్సులు, ఎల్‌టీ, హెచ్‌ఏ, సూపర్‌వైజర్ ఉదయం 10 గంటలలోపు వచ్చారు. వైద్యాధికారి ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరయ్యారు. అప్పటికే వచ్చిన రోగులను స్టాఫ్ నర్సు పరీక్షించారు. ఆ తర్వాత వైద్యాధికారి రోగులకు చికిత్స అందించారు. ఒక్కరోజే 80 మంది రోగులు వచ్చారు. ఇద్దరు వైద్యులు, ఇద్దరు ఫార్మసిస్ట్, మూడు స్టాఫ్ నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండలంలో ఎనిమిది సబ్ సెంటర్లలో 16 మంది ఏఎన్‌ఎంలకు 11 మంది మాత్రమే ఉన్నారు. పీఎం జన్‌మన్ వాహనం ఆలస్యంగా రావడంతో ఆ సిబ్బంది ఉదయం 11 గంటల వరకు పీహెచ్‌సీలోనే వాహనం కోసం ఎదురుచూశారు. ఆదిమ గిరిజన గ్రామాలకు సిబ్బంది ఆలస్యంగా వెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా యునానీ ఆస్పత్రి లేదు. కానీ ఫార్మసిస్ట్, అటెండర్‌ను మాత్రం నియమించారు. ఇన్‌పేషంట్లు లేకపోవడంతో బెడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.
విధుల్లో ఒక్కరే..
కౌటాల: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు స్టాఫ్ నర్సులకు ఇ ద్దరు ఉన్నారు. ఆయుష్ వైద్యురాలు వారంలో మూడు రోజులపాటు విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజూ 60 వరకు ఓపీ నమోదవుతుంది. గతంలో ఇక్కడ రోజుకు రెండు, మూడు ప్రసవాలు చేయగా, సిబ్బంది కొరత కారణంగా గర్భిణులను కాగజ్‌నగర్‌కు రెఫర్ చేస్తున్నారు. గుండాయిపేట్ హెల్త్ సబ్ సెంటర్‌లోనూ సిబ్బంది లేరు.
వైద్యం.. దైన్యం
వైద్యం.. దైన్యం