
మానవత్వం మరిచి..
మొదటి భార్యకు మగ సంతానం జన్మించలేదని రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ భర్త. ఆమెకూ ఇద్దరు ఆడపిల్లలే జన్మించడంతో ఆగ్రహం పెంచుకున్నాడు. రెండో భార్యతో గొడవపడి దాడి చేసి చంపాడు. కాగజ్‌నగర్ మండలం వంజిరీ గ్రామానికి చెందిన డోకే జయరాం మొదటి భార్య భీంబాయికి ఓ కూతురు పుట్టగా.. మగ సంతానం కోసం జగన్నాథ్‌పూర్‌కు చెందిన పోషక్క(40)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 24న పోషక్కతో గొడవపడి తలపై పలుగుతో బలంగా కొట్టి హత్య చేశాడు.
కౌటాల(సిర్పూర్): పాత కక్షలు, వివాహేతర సంబంధాలు, వ్యవసాయ భూముల పంచాయితీలు, ప్రేమ వ్యవహారాలు.. కారణాలు ఏవైనా జిల్లాలో నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హత్య కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. జిల్లాలో 2023లో 32 హత్యలు జరగగా, 21 హత్యాయత్నాలు జరిగినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అలాగే 2024లో 12 హత్యలు, 32 హత్యాయత్నాలు జరిగాయి.
పచ్చనికాపురాల్లో చిచ్చు
ముఖ్యంగా వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. భార్యభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరు దంపతుల మధ్య మూడో వ్యక్తి మరొకరు రావడంతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు జరుగుతున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల సంతానం అనాథలుగా మారుతున్నారు. తాజాగా పెంచికల్‌పేట్ మండలం కొండపెల్లి గ్రామంలోనూ ఓ యువకుడు వివాహేతర సంబంధం వివాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
భూతగాదాలు.. ప్రేమ వ్యవహారాలు
గ్రామీణ ప్రాంతాల్లో భూతగాదాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అలాగే ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లాలో భూములకు విలువ పెరిగింది. పోడు భూములకు సైతం రైతులు పట్టాలు పొందారు. ఫలితంగా భూపంచాయతీలు పెరిగిపోయాయి. వ్యవసాయ భూములు, ఇంటి స్థలాల విషయంలోనూ దాడులకు పాల్పడుతున్నారు. గత నెల 19న చింతలమానెపల్లి మండలంలోని ఓ గ్రామంలో భూవివాదంలో ఇరువర్గాల వారు దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఇరువర్గాలపైనా కేసు నమోదు చేశారు. ప్రేమ వ్యవహారాలు కూడా అగ్గిరాజేస్తున్నాయి. గత నెల 3న కౌటాల మండలంలోని ఓ గ్రామంలో ప్రేమ వ్యహహారంలో అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు యువకుడిని కర్రలతో చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో స్నేహితుల మధ్య విభేదాలు తలెత్తినా చివరకు హత్యకు దారితీస్తున్నాయి. జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు చేపడుతూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
అయినవారే కడతేరుస్తున్నారు..
వివాహేతర బంధాలు.. భూ తగాదాలే ప్రధాన కారణాలు
ఏటా పెరుగుతున్న హత్య కేసులు
సామరస్యంగా పరిష్కరించుకోవాలి
దంపతుల మధ్య, భూ వివాదాల్లో సమస్యలు వస్తే క్షణాకావేశంతో వ్యవహరించొద్దు. సామరస్యంగా వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆత్మహత్యలకు పాల్పడడం లేదా మరొకరిని హత్య చేయడం సరికాదు. నేరాలకు పాల్పడితే తప్పనిసరిగా శిక్ష పడుతుంది. బాధిత కుటుంబాలు రోడ్డున పడతాయి. నేరాల నియంత్రణకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సమస్యలు ఉంటే డయల్ 100 లేదా పోలీసులను సంప్రదించాలి.
– కాంతిలాల్ పాటిల్, ఎస్పీ
కష్టసుఖాల్లో భర్తకు తోడుగా నిలవాల్సిన భార్యే అతడి పాలిట మృత్యువైంది. రెబ్బెన మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పుప్పాల సతీశ్(30) నంబాలకు చెందిన రజితను వివాహం చేసుకున్నాడు. కాయకష్టం చేసి అతడు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిత్యం మద్యం తాగి వస్తున్నాడనే కారణంతో జనవరి 16న గుర్తుతెలియని పురుగుల మందు తాగించి సతీశ్‌ను అతడి భార్య చంపింది.

మానవత్వం మరిచి..