
కదం తొక్కిన కార్మిక లోకం
● జిల్లాలో సార్వత్రిక సమ్మె విజయవంతం
ఆసిఫాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్ చౌక్ వద్ద మహాధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజేందర్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులు హరించి వేయడంతోపాటు సంఘాలను సైతం అణచివేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ విధానాలు మార్చుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పదేళ్లలో కార్మికులు మరింత కష్టాల్లో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సప్త బాలకిషన్, నాయకులు కమలాకర్, అశోక్, పిడుగు శంకర్, ఆత్మకూరి చిరంజీవి, సుధాకర్, సారిక, దుర్గం దినకర్, మాలశ్రీ, కార్తీక్, రాజు, దివాకర్, కొమురక్క తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాలను పునరుద్దరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం పట్టణంలోని బాలభారతి పాఠశాల నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్‌లతో కార్మికులు సమ్మె చేసే హక్కు కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్.త్రివేణి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ఆనంద్‌కుమార్, సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూశన రాజన్న, నాయకులు నగరం పద్మ, శంకర్, సంజీవ్, వివిధ వర్గాల కార్మికులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి ఏరియాలో సక్సెస్
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియా సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. అత్యవసర సిబ్బంది మినహా మిగిలిన కార్మికులెవ్వరూ విధులకు హాజరు కాలేదు. కైరిగూడ ఓసీపీతోపాటు వివిధ డిపార్టుమెంట్లు వెలవెలబోయాయి. ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా రవాణా కూడా ఆగిపోయింది. మొదటిషిఫ్టు నుంచి నైట్ షిఫ్టు వరకు మూడు షిఫ్టులో కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో ఏరియా సుమారు 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తిని కోల్పోవాల్సి వచ్చింది. సింగరేణి అధికారుల అంచనా ప్రకారం.. సమ్మె ప్రభావంతో ఏరియాలో 8 వేల టన్నుల ఉత్పత్తి నష్టం సంభవించగా.. ఉత్పత్తి పరంగా ఏరియా రూ.84.5లక్షల వరకు నష్టపోయినట్లు అంచనా వేశారు. ఏరియాలో సుమారు 800 మంది కార్మికులు పనిచేస్తుండగా.. వారు రూ.38లక్షల వరకు జీతాల రూపంలో నష్టపోయారు. సమ్మె విజయవంతం కావడంపై ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్, హెచ్‌ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

కదం తొక్కిన కార్మిక లోకం

కదం తొక్కిన కార్మిక లోకం