
● కేజీబీవీలకు సరఫరా కాని ఇంటర్ పాఠ్యపుస్తకాలు ● ఇప్పటి
ఈ ఫొటోలో కనిపిస్తున్న విద్యార్థిని సంజన. దహెగాం కేజీబీవీలో ఇంట ర్మీడియెట్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తరగతులు ప్రారంభమై 25 రోజులు దాటినా ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించలేదు. పాత పుస్తకాలతోనే కాలం వెల్లదీస్తోంది. ఆలస్యం అవుతుండడంతో చదువులో వెనుకబడిపోతున్నామని వాపోయింది. జిల్లా వ్యాప్తంగా కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న బాలికలందరిదీ ఇదే పరిస్థితి.
దహెగాంలోని కేజీబీవీలో బోధిస్తున్న అధ్యాపకురాలు(ఫైల్)
దహెగాం(సిర్పూర్): చదువు మధ్యలో ఆపిన బాలికలు నష్టపోవద్దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఏర్పాటు చేసింది. పేద కుటుంబాలకు చెందిన బాలికలు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలలకు వెళ్లలేని వారి కోసం ప్రభుత్వం విడతల వారీగా ఇంటర్ తరగతులు సైతం ప్రారంభిస్తున్నారు. అయితే కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు నేటికీ పాఠ్య పుస్తకాలు అందకపోవడంతో చదువులు ముందుకు సాగడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై 25 రోజులు దాటడంతో బాలికలు పాత పుస్తకాలతో నెట్టుకొస్తున్నారు.
13 కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు
జిల్లాలో మొత్తం 15 కస్తూరిబా విద్యాలయాలు ఉండగా, 13 చోట్ల కళాశాలలు కొనసాగుతున్నాయి. పెంచికల్‌పేట్, కౌటాల కేజీబీవీల్లో ఇంకా ఇంటర్ అందుబాటులోకి రాలేదు. జూన్ 12 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైంది. నేటికీ ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 623 మంది ఉండగా, ద్వితీయ సంవత్సరంలో 547 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇంకా ప్రవేశాలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు నష్టపోకుండా పాత పుస్తకాలతోనే పాఠాలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం బాలికలు పాత పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. అయితే పాత పుస్తకాలు ప్రస్తుత విద్యార్థుల సంఖ్యకు సరిపోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ప్రభుత్వ కాలేజీలకు సరఫరా
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభమై నెల రోజులు కావొస్తోంది. జూన్ 1 నుంచే వీరికి తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఫస్టియర్‌లో 1,577 మంది, ద్వితీయ సంవత్సరంలో 2,535 మంది చదువుకుంటున్నారు. వీరందరికి గత నెలలోనే పాఠ్య పుస్తకాలు అందించారు. తరగతులు సైతం కొనసాగుతున్నాయి.

● కేజీబీవీలకు సరఫరా కాని ఇంటర్ పాఠ్యపుస్తకాలు ● ఇప్పటి