
‘అసత్య ప్రచారం మానుకోవాలి’
కాగజ్‌నగర్‌టౌన్: జీవో 49పై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు అసత్య ప్రచారం మానుకోవాలని ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు జీవో 49కు అనుకూలంగా ప్రతిపాదనలు చేసి పంపించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రజలను మభ్యపెడుతూ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జీవో గెజిట్ ఆపాలని సవాల్ విసిరారు. జీవో గెజిట్ ఆపలేని పక్షంలో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ విఠల్ ప్రకటించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఆనంద్‌రావు, నాయకులు సిడాం గణపతి, దస్తగిరి, గజ్జి రామయ్య, ఆవుల రాజ్‌కుమార్ పాల్గొన్నారు.