
ఇందిరమ్మ ఇళ్లపై రీసర్వే
క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం 5,910 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. మొదటి విడతలో మండలానికి ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేసింది. 15 పైలట్ గ్రామాలకు 1,625 ఇళ్లు మంజూరు కాగా, రెండో విడతలో 3,285 ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల రీసర్వే ప్రక్రియను చేపట్టగా.. పంచాయతీ కార్యదర్శులకు పైలట్ గ్రామాల్లో సర్వే తలనొప్పిగా మారుతోంది. యాప్‌లో గతంలో నివసించిన పాత ఇంటి ఫొటోతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి లొకేషన్ ఫొటోలను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. అయితే చాలామంది లబ్ధిదారులు గతంలో నివాసం ఉన్న ఇంటిని తొలగించి.. అదే ప్రదేశంలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పాత ఇల్లు లేకపోవడంతో రీసర్వేలో పాత ఇంటి ఫొటో అప్‌లోడ్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. పాత ఇంటి ఫొటో స్థానంలో ఖాళీ ప్రదేశాన్ని, పక్కనే ఉన్న మరో పాత ఇంటి ఫొటోనైనా అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాకు మంజూరైన ఇళ్లలో ఇప్పటికే సుమారు 1,300 వరకు నిర్మాణాలు ప్రారంభం కాగా.. 720 వరకు పునాదులు కూడా పూర్తయ్యాయి. కొన్ని లెంటల్ లెవల్, మరికొన్ని స్లాబ్ కూడా పూర్తయ్యాయి. అయితే రీసర్వేలో ఇంటిని నిర్మించే ఖాళీ స్థలం ఫొటోను సైతం యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉండడంతో దాని స్థానంలో పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నారు.
రెబ్బెన(ఆసిఫాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల వివరాలను మరోసారి సేకరిస్తోంది. పంచాయతీ కార్యదర్శుల ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా సర్వే చేయిస్తోంది. లబ్ధిదారులకు సంబంధించిన అన్ని వివరాలతోపాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. రాష్ట్రంలో గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా కేంద్రం కూడా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వాటాతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా లబ్ధిదారుల వివరాలు సేకరిస్తున్నారు.
60కి పైగా అంశాలు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే మరోసారి చేపట్టాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజులుగా కార్యదర్శులు గ్రామాల్లో వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రధాన మంత్రి ఆవాస్ ప్లస్ యాప్‌లో ముందుగా వారీ వివరాలను నమోదు చేసి, కేవైసీ పూర్తి చేసుకుంటున్నారు. సర్వే ప్రారంభంలో రెవెన్యూ గ్రామాల్లో ఆవాస్ ప్లస్ యాప్ ఓపెన్ కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత మ్యాపింగ్ పూర్తి చేసి, అన్ని గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా సర్వే ప్రక్రియ సాగుతోంది. అయితే యాప్‌లో 60పైగా ప్రశ్నలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు. పేరు, ఆధార్‌కార్డు, జాబ్‌కార్డు నంబర్, జెండర్, సోషల్ కేటగిరీ, వ యస్సు, మొబైల్ నంబర్, విద్యార్హత, వృత్తి, కుటుంబ సభ్యుల సంఖ్య, క్యాన్సర్ వంటి వ్యాధులు, నాన్ అగ్రికల్చర్ వృత్తి వివరాలు, మురుగుదొడ్లు, కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రొఫెనల్ ట్యాక్స్ చెల్లింపులతోపాటు అన్నిరకాల సమాచారంతో కూడిన సుమారు 60కిపైగా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వా త లబ్ధిదారుడి ఫొటోతో పాటు ప్రస్తుతం నిర్మించే ఇంటి లొకేషన్, గతంలో ఉన్న పాత ఇంటి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అయితే సర్వే సమయంలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలతో కార్యదర్శులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాలు మ్యాపింగ్ లేకపోవడం, పలు గ్రామాల్లో నెట్‌వర్క్ సరిగా లేకపోవడం, ఆధార్ అప్‌డేట్ లేకపోవడం, కొంతమంది లబ్ధిదారుల అధార్ నంబర్ ఇప్పటికే నమోదు అయినట్లు చూపించడం, కొన్నిరకాల బ్యాంకుల పేర్లు యాప్‌లో కనిపించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే సర్వే కోసం పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుడి కోసం వెళ్లిన సమయంలో ఇంటి వద్ద ఉండడం లేదు. ఇలా పలు కారణాలతో రీసర్వే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది.
మరోసారి లబ్ధిదారుల వివరాలు సేకరణ
కేంద్ర ప్రభుత్వ యాప్‌లో అప్‌లోడ్
సాంకేతిక సమస్యలతో పంచాయతీ కార్యదర్శులు సతమతం