
● ఉప్పొంగిన వాగులు, ఉధృతంగా ప్రవహించిన నదులు ● స్తంభించ
వరద నుంచి కాపాడిన వ్యక్తితో అధికారులు
గూడెం వద్ద మునిగిన వరినారు చూపుతున్న రైతు
బుధవారం నమోదైన
వర్షపాతం(మిల్లీమీటర్లలో)
ప్రాంతం వర్షపాతం
బెజ్జూర్ 213.2
చింతలమానెపల్లి 181.6
పెంచికల్‌పేట్ 76.6
కౌటాల 60.0
దహెగాం 30.2
సిర్పూర్(టి) 27.6
లింగాపూర్ 16.2
తిర్యాణి 10.0
గూడెం నుంచి కోయపెల్లి మార్గంలో వంతెన వద్ద కొట్టుకుపోయిన రహదారి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, ప్రాణహిత నది పరీవాహక ప్రాంతాల్లో ఉండేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్టు రహదారుల పైనుంచి దాటొద్దని, జలాశయాలు, చెరువులు, కుంటలు చూసేందుకు వెళ్లొద్దని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివాసం ఉండొద్దని, తడిగా ఉన్న విద్యుత్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ తాకొద్దన్నారు, చేపల వేటకు వెళ్లొద్దన్నారు. జలపాతాలను సందర్శించవద్దన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షణ సహాయం కోసం విపత్తు ప్రతిస్పందన దళాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని, విపత్కర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 87126 70551 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ఆసిఫాబాద్/కౌటాల/చింతలమానెపల్లి/బెజ్జూర్: రెండు రోజులుగా జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచికొట్టింది. వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహించగా, చెరువులు, పొలాల్లోకి వరద చేరింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. ప్రాణహిత, వార్ధా, పెన్‌గంగ, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండగా, మరో మూడు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి.
● బెజ్జూర్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం అత్యధికంగా 213.2 మీమీ వర్షం నమోదైంది. సుశ్మీర్ ఒర్రె ఉప్పొంగి ప్రవహించింది. సోమిని, మూగవెల్లి, ఉప్పలగూడెం, పాతసోమిని తదితర గ్రామాలతోపాటు మండల కేంద్రానికి రాకపోకలు స్తంభించాయి. తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్ర సమీపంలోని సెగ్రిగేషన్ షెడ్డులో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. చుట్టూ వరద చేరడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కౌటాల సీఐ ముత్యం రమేశ్, తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎస్సై సత్తార్ పాషా స్థానికుల సాయంతో అతడిని రక్షించారు. చిన్నసిద్ధాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు ఉదయ్‌కిరణ్, మహేశ్వరి, సువర్ణ విధులు ముగించుకుని మండల కేంద్రానికి వెళ్తుండగా ఎల్కపల్లి, చిన్న సిద్దాపూర్ గ్రామాల మధ్య ఒర్రెను ప్రమాదకరంగా దాటారు. పెద్దవాగు, చిన్నవాగులు ఉప్పొంగడంతో పంట పొలాలు నీట మునిగాయి.
● చింతలమానెపల్లి మండలం బాబాసాగర్, నాయకపుగూడ దారిలో వాగు ఉప్పొంగడంతో నాయకపుగూడకు రవాణా నిలిచిపోయింది. శివపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు వద్ద ఇదే పరిస్థితి. పాల్వాయినగర్, చింతలపాటి వద్ద వాగులు ఉప్పొంగి కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్ మార్గంలో ప్రయాణాలు ఆగిపోయాయి. చింతలమానెపల్లి నుంచి గూడెం మీదుగా అహేరికి వెళ్లే మార్గం పలుచోట్ల మునిగింది. కేతిని సమీపంలోని ఊట్లవాగు వంతెనకు ఇరువైపులా వరద ప్రవహించింది. గూడెం నుంచి ప్రాణహిత వంతెన సమీపంలో అరకిలోమీటరు మేర వరద రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో చింతలమానెపల్లి, అహేరి మధ్య రవాణా నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు సైతం రద్దు చేశారు. దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వంతెన మునిగి సుమారుగా కిలోమీటర్ వరకు వరద ప్రవహిస్తోంది. శివపెల్లి, దిందా, నాయకపుగూడ, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోగా, బూరెపల్లి, రణవెల్లి గ్రామాలకు తాత్కాలికంగా రాకపోకలకు ఆగిపోయాయి. గూడెం, కోయపెల్లి, బూరుగూడ, దిందా గ్రామాల్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు తిరిగి రాలేకపోయారు. గ్రామాల్లోనే ఉండిపోయారు.
● కౌటాల తహసీల్దార్ కార్యాలయ భవనం శిథిలాస్థలో చేరడంతో వర్షానికి భవనం పైకప్పు నుంచి నీరుగారి గదుల్లోకి చేరింది. కార్యాలయం ఎదుట కూడా వరదనీరు చేరింది. వీర్ధండి గ్రామంలో ఇళ్లలోకి వరద చేరింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది, తాటిపల్లి వద్ద వార్ధా నది, గుండాయిపేట, వీర్ధండి వద్ద వైన్‌గంగ నదులు ఉప్పొంగి ప్రవహించాయి. జాలరులు చేపల వేటతోపాటు నాటు పడవల ప్రయాణాలు నిలిపివేశారు.

● ఉప్పొంగిన వాగులు, ఉధృతంగా ప్రవహించిన నదులు ● స్తంభించ