
ప్రతీరోజు ఒక పాఠశాలను సందర్శించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్: అధికారులు ప్రతీరోజు ఒక ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వసతి గృహాల సందర్శన, ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఈ నెలాఖరులోగా వందశాతం పనులు ప్రారంభించే విధంగా పర్యవేక్షించాలన్నారు. పీఎం ఆవాస్ యోజన కింద మంజూరైన ఇళ్ల సర్వే నిర్వహించి, వివరాలు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. పీఎం జన్‌మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరైన ఇళ్ల వివరాలను సేకరించాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. వనమహోత్సవం కింద జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని ఆగస్టు 15లోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, హౌజింగ్ పీడీ వేణుగోపాల్, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం అడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో సీతారాం, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.