ఆసిఫాబాద్: భూసమస్యలు పరిష్కరించాలని, గ్రామానికి రోడ్డు వేయాలని, పింఛన్ మంజూరు చేయాలని, ఉపాధి చూపి ఆదుకోవాలని.. ఇలా అనేక సమస్యలతో జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి బాధితులు ప్రతీ సోమవారం కలెక్టరేట్‌కు క్యూ కడుతున్నారు. అధికారులకు బాధలు చెప్పుకుని పరిష్కారించాలని వేడుకుంటున్నారు. ప్రజల సౌకర్యార్థం ఇక నుంచి సోమవారం మాత్రమే కాకుండా ప్రతీ రోజు దరఖాస్తులు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జీ– 3లో దరఖాస్తులు స్వీకరించేందుకు గ్రీవెన్స్ సెల్ ప్రారంభించారు.
ఇన్‌చార్జి మంత్రి సూచనతో..
ప్రతీ సోమవారం కలెక్టరేట్‌తోపాటు కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణికి వారానికి సగటున వందకు పైగా అర్జీలు వస్తున్నాయి. ఇటీవల జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఆదిలాబాద్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతీరోజు దరఖాస్తులు స్వీకరించేలా కలెక్టరేట్లలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సూచనలకు అనుగుణంగా ఆసిఫాబాద్‌లోని కలెక్టరేట్‌లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా ఈ నెల 8న అధికారులతో కలిసి ‘ప్రతి దినం ప్రజల కోసం కలెక్టర్ గ్రీవెన్స్’ పేరుతో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఇద్దరు సిబ్బందిని నియమించారు. కార్యాలయ పని వేళల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు.
పనివేళల్లో స్వీకరణ
కలెక్టరేట్‌లో ఇక నుంచి పనిరోజుల్లో ఎప్పుడైనా ప్రజలు అర్జీలు సమర్పించవచ్చు. కలెక్టర్ అందుబాటులో ఉంటే నేరుగా ఆయనకే బాధలు చెప్పుకోవచ్చు. లేనిపక్షంలో గ్రీవెన్స్ సెల్‌లో సిబ్బంది దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తారు. మంగళవారం రెండు దరఖాస్తులు రాగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత మండలాలకు పరిష్కారం కోసం పంపించారు. జవాబుదారీతనం పెరగడంతోపాటు సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
సమస్యల పరిష్కారమే ధ్యేయం
ప్రజల సౌకర్యం కోసమే జిల్లా కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కొంతమందికి అనుకూలంగా లేకపోవడంతో నిత్యం దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేశాం. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకే ఈ కేంద్రం ప్రారంభించాం. దరఖాస్తులు పరిష్కార స్థితి ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఇది కొత్త ఆలోచన విధానం. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నాం.
– వెంకటేశ్ దోత్రే, కలెక్టర్
ఏడాదిలో 2,244 దరఖాస్తులు
ప్రత్యేక జిల్లాగా మారిన తర్వాత ప్రజలకు పాలన చేరువైంది. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో సుమారు వందకు పైగా దరఖాస్తులు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో మొత్తం 2,244 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1,517 దరఖాస్తులు పరిష్కరించగా, 625 పెండింగ్‌లో ఉన్నాయి. మిగిలిన 102 అర్జీలను పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించారు. గ్రీవెన్స్‌లో అధికంగా వ్యవసాయ సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పింఛన్లుతోపాటు వివిధ సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
● కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ● ఉమ
● కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ● ఉమ
● కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు ● ఉమ