
కాస్త ఉపశమనం
● కొన్నిరోజులుగా వానల్లేక మొలకెత్తని పత్తి విత్తనాలు ● వేల ఎకరాల్లో రెండోసారి వేయాల్సిన పరిస్థితి ● రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు ● పంటలకు కొంత మేలు చేస్తుందంటున్న రైతులు
కౌటాల(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి, సోయా, కంది పంటలకు కొంత మేలు చేయనున్నాయి. తొలకరి వానతో మురిపించిన వరుణుడు.. కొద్ది రోజులుగా ముఖం చాటేయడంతో జిల్లావ్యాప్తంగా పత్తి విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తలేదు. మొలకెత్తిన మొక్కలు కూడా మాడిపోతున్నాయి. ఈ తరుణంలో ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. గత సీజన్‌లో ప్రధాన పంటలైన పత్తి, కంది, సోయా 3.40 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ సీజన్‌లో 3.35 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు.
తొలకరితోనే పనులు.. మొలకెత్తని విత్తు
జిల్లాలో మూడేళ్లుగా జూన్ మొదటి వారంలోనే తొలకరి వానలు పలకరిస్తున్నాయి. ఈ ఏడాది ఇంకాస్త ముందుగానే మేలో వర్షాలు పడడంతో జిల్లా రైతాంగం సాగు పనులు ప్రారంభించింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న దశలో రెండు వారాలుగా వాన జాడ కరువైంది. సీజన్ ప్రారంభమై 20 రోజులైనా ఓ మోస్తరు వర్షాలు లేకపోవడంతో చెరువుల్లోకి చుక్కనీరు చేరలేదు. జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో రైతులు జూన్ మూడో వారంలోగా పత్తి విత్తనాలు వేశారు. మొదటి వారం నుంచే వర్షాభావ పరిస్థితులు ఉన్నా చిరుజల్లులు పలకరిస్తూ ఉన్నాయి. దీంతో వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. దుక్కిదున్నడం మొదలుకొని విత్తనాలు వేసే వరకు ఎకరానికి రూ.10 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది. కొందరు రైతులకు బావులు ఉన్నా నీటితడులు అందించడం సాధ్యం కాలేదు. మొదటి దఫా వేసిన విత్తనాలు మొలకెత్తని చోట రైతులు మళ్లీ రెండో దఫా వేసేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు రోజులుగా వానలు..
జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో జూన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 141.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 24 రోజుల్లో 122.3 మి.మీ.లు నమోదైంది. ఈ నెలలో 13 మి.మీ. లోటు ఉందని అధికారులు వెల్లడించారు. చింతలమానెపల్లి మండలంలో లోటు వర్షపాతం ఉండగా.. కౌటాల, జైనూర్, సిర్పూర్(యు), తిర్యాణి, బెజ్జూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువలేదు. ఈ వర్షాలకు విత్తనాలు కొంతశాతం మొలకెత్తుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా మొలవలేదు
ఈ వానాకాలం రెండెకరాల్లో పత్తి విత్తనాలు వేశాం. అప్పటి నుంచి చిరుజల్లులే తప్పా మోస్తరు వాన కూడా పడలేదు. విత్తనాలు వేసి రెండు వారాలవుతున్నా ఇంకా మొలవలేదు. మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మళ్లీ పెట్టుబడికి డబ్బులు కావాలి.
– శివరాం, గురుడుపేట, మం.కౌటాల
మంగళవారం కురిసిన వర్షం
ప్రాంతం వర్షపాతం(మిల్లీమీటర్లు)
కాగజ్‌నగర్ 49.0
పెంచికల్‌పేట్ 43.2
దహెగాం 56.1
బెజ్జూర్ 61.3
సిర్పూర్(టి) 52.3
కౌటాల 41.6
చింతలమానెపల్లి 21.6
వాంకిడి 45.4
రెబ్బెన 27.8
లింగాపూర్ 2.4
తిర్యాణి 14.5
జైనూర్ 10.4
ఆసిఫాబాద్ 32.2
కెరమెరి 18.3
సిర్పూర్(యు) 9.6

కాస్త ఉపశమనం