
● వానాకాలం సీజన్‌కు చురుగ్గా ఏర్పాట్లు ● విత్తనాలు, ఎరు
రెబ్బెన(ఆసిఫాబాద్): వానాకాలం పంటల సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. మరో పక్షం రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో రైతులు పంటల సాగుకు అవసరమైన పనుల్లో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి భూములు తడవడంతో రైతులు దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులను పొలాల్లో చల్లడం వంటి పనులు చేపడుతున్నారు. జిల్లాలో సాగు వనరులు అంతంత మాత్రంగానే ఉండటంతో రైతులు పూర్తిగా వర్షాధార పంటల సాగునే నమ్ముకున్నారు. దీంతో ఈసారి కూడా ప్రధాన వాణిజ్య పంట అయిన పత్తే అధిక మొత్తంలో సాగు కానుంది. సాగునీటి వసతి అందుబాటులో ఉన్న రైతులు మాత్రం వరి సాగు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు.
పొడి దుక్కిలోనే విత్తనాలు
జిల్లాలోని 15 మండలాల పరిధిలో సుమారు 4.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వ ర్షాధార పంటలైన పత్తి, కంది వంటి పంటలు ఎక్కు వ విస్తీర్ణంలో సాగుచేస్తారని అధికారులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో పత్తి పంటలను సాగుచేసే రైతుల తొలకరి వర్షాలకు ముందే పొడి దుక్కిలో విత్తనాలు విత్తుతూ వస్తున్నారు. ఈసారి సైతం ఇదే పద్ధతి కొనసాగించేలా కనిపిస్తున్నారు. అయితే తేలికపాటి భూముల్లో 50 మిల్లీమీటర్ల వర్షపాతం, నల్లరేగడి నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షం నమోదైన తరువాతే విత్తనాలు విత్తుకోవాలని వ్యవసాయశా ఖ అధికారులు సూచిస్తున్నారు. తొలకరి వర్షాలు ఆ శాజనకంగా పడితే విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అరకొరగా పడితే మా త్రం విత్తనాలు మొలకెత్తకుండానే భూమిలోనే చెడిపోయే ప్రమాదం ఉంది. దీంతో రైతులు మరోసారి విత్తనాలు విత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.
పొలం బాటలో రైతులు
వర్షాకాలం సమీపిస్తుండటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాల్లో పాత పంటల అవశేషాలను తొలగించడం, దుక్కులు దున్నడం, సేంద్రియ ఎరువులు తరలించడం వంటి పనులు చేపడుతున్నారు. జూన్ మొదటివారంలో తొలకరి వర్షాలు పడక ముందే పత్తి విత్తనాలను విత్తుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. చాలా మంది రైతులు అవగాహన లేక వరికొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దీంతో భూముల్లో ఉన్న సూక్ష్మపోషకాలు నశించి దిగుబడి తగ్గుతోంది. వరికొయ్యలను కాల్చడం కంటే భూమిలోనే కలియదున్నితే పంటలకు ఎంతో మేలు కలుగుతుందని అధికారులు చెప్పుతున్నారు.
దుక్కి దున్ని సిద్ధంగా ఉంచిన చేను
వానాకాలం సీజన్‌కు కావాల్సిన విత్తనాలు
పత్తి ప్యాకెట్లు 6,70,727
వరి (క్వింటాళ్లలో) 14,215
కంది (క్వింటాళ్లలో) 1217.2
అవసరమైన ఎరువులు (మెట్రిక్ టన్నుల్లో)
యూరియా 60,081
డీఏపీ 40,052
ఎంవోపీ 10,011
ఎస్‌ఎస్‌పీ 20,025
కాంప్లెక్స్ 20,025