
మున్సిపల్ కార్మికుల సమ్మె నోటీసు అందజేత
ఆసిఫాబాద్‌అర్బన్: ఈ నెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నామని, అలాగే 21వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం సమ్మె నోటీసు అందించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల కృష్ణమాచారి మాట్లాడుతూ ఆసిఫాబాద్ మున్సిపాలిటీగా మారి 14 నెలలవుతున్నా మున్సిపల్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. కార్మికులకు నాలుగు నెలలుగా వేతనాలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు పెంచడంతోపాటు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 21 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు తోట సమ్మయ్య, కార్యదర్శి మాట్ల రాజయ్య, నాయకులు దుర్గాప్రసాద్, వినోద్ ఉన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు మంగళవారం జిల్లా కేంద్రంలో డీటీడీవో రమాదేవి కి వినతిపత్రం అందించారు. డైలీవేజ్ ఔట్‌సోర్సింగ్ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమాచారి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన లేబర్ కోడ్‌లతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రాంబాయి, పత్రుబాయి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.