‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

‘పది’ పరీక్షలకు సర్వం సిద్ధం

Mar 21 2025 1:25 AM | Updated on Mar 21 2025 1:22 AM

● నేటి నుంచి ఏప్రిల్‌ 2 వరకు.. ● హాజరు కానున్న 6,421 మంది విద్యార్థులు

ఆసిఫాబాద్‌రూరల్‌: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జిల్లాలోని 36 కేంద్రాల్లో 6,421 మంది విదార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో బాలురు 2,894 మంది, బాలికలు 3,527 మంది ఉన్నారు. కాగా, పదో తరగతి వార్షిక పరీక్షలు తొలిసారి సీసీ కెమెరాల నిఘాలో జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 36 డిపార్ట్‌మెంట్‌ అధికారులు, 36 మంది సీ సెంటర్‌ కస్టోడియన్లు, 432 మంది ఇన్విజిలేటర్లు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నియమించారు. పోలీస్‌ స్టేషన్‌ దూరంగా ఉన్నట్లు గుర్తించిన మోడీ, మహాగావ్‌, గంగాపూర్‌ పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక కస్టోడియన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ సెంటర్‌ వద్ద ఇద్దరు పోలీస్‌ సిబ్బంది, ఒకరు వైద్యసిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.

ఐదు నిమిషాల మినహాయింపు

కాగజ్‌నగర్‌లో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆసిఫాబాద్‌లో 5, కెరమెరి 3, సిర్పూర్‌(టి) 3, రెబ్బెన 3, జైనూర్‌ 2, వాంకిడి 2, కౌటాలలో 2, దహెగాం 2, బెజ్జూర్‌ 2, తిర్యాణి, పెంచికల్‌పేట్‌, చింతలమానెపల్లి మండలాల్లో ఒకటి చొప్పున సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. సమీపంలోని జిరాక్స్‌, ఇంటర్‌నెట్‌ సెంటర్లు మూసిఉంచాలని సూచించారు.

జిల్లా కేంద్రంలో హాల్‌టికెట్‌ నంబర్లు వేస్తున్న సిబ్బంది

నిర్భయంగా రాయాలి

విద్యార్థి జీవితంలో పదో తరగతి పరీక్షలు కీలకమైనవి. ఆందోళనకు గురికాకుండా విద్యార్థులు నిర్భయంగా పరీక్షలు రాయాలి. 30 నిమిషాలు ముందుగానే కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి.

– యాదయ్య, డీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement