నెలరోజులుగా ‘భగీరథ’ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నెలరోజులుగా ‘భగీరథ’ బంద్‌

Mar 14 2025 1:52 AM | Updated on Mar 14 2025 1:48 AM

● అందవెల్లి వంతెన అప్రోచ్‌ రోడ్డు పనులతో పైప్‌లైన్‌ తొలగింపు ● పనులు పూర్తయినా నీటి సరఫరా పునరుద్ధరించని అధికారులు ● నాలుగు మండలాల్లోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు

దహెగాం(సిర్పూర్‌): మిషన్‌ భగీరథ నీటి సరఫరా నెల రోజులుగా నిలిచిపోయింది. ఓ వైపు ఎండలు మండుతుండగా.. నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. కాగజ్‌నగర్‌ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగుపై నిర్మించిన వంతెన అప్రోచ్‌ రోడ్డు పనులు ఫిబ్రవరి 12న ప్రారంభించారు. వంతెన పైనుంచి భగీరథ పైప్‌లైన్‌ ఉండటంతో అప్రోచ్‌ పనుల సమయంలో ఆ పైప్‌లైన్‌ తొలగించారు. అప్పటి నుంచి భగీరథ నీటి సరఫరా కావడం లేదు. నెల రోజులైనా పునరుద్ధరించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తాగునీటికి తంటాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ట్రాక్టర్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

ట్యాంకర్ల ద్వారా సరఫరా..

నెల రోజులుగా భగీరథ పథకం నీటి సరఫరా నిలి చిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్‌ బోర్ల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. దహెగాం మండలం ఒడ్డుగూడ, బామానగర్‌, ఐనం గ్రామాల్లో తీవ్రమై న నీటి ఎద్దడి ఉన్నందున పంచాయతీల ఆధ్వర్యంలో ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నారు. చిన్న ఐనంలో తాగునీటి ఎద్దడిపై ‘సాక్షి’లో కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి వాగు వద్ద బోరు కు మోటర్‌ బిగించి సమస్యను పరిష్కరించారు. మిగిలిన గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు కొనసాగుతున్నాయి.

పట్టించుకోని అధికారులు..

నెల రోజులుగా గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని చేతిపంపుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఎడ్లబండ్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. వంతెన వద్ద అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తయి మూడు రోజులు కావొస్తున్నా పైప్‌లైన్‌ పనులు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మూడు రోజుల్లో పూర్తి చేస్తాం

అందవెల్లి పెద్దవాగు వద్ద వంతెన అప్రోచ్‌ పనులు ప్రారంభించడంతో భగీరథ పైప్‌లైన్‌ కనెక్షన్‌ తొలగించాం. అప్రోచ్‌ పనులు పూర్తయిన నేపథ్యంలో మూడు రోజుల్లో పైప్‌పైన్‌ పనులు పూర్తి చేస్తాం. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. త్వరలో తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తాం.

– సాయికృష్ణ, భగీరథ ఏఈ

64 గ్రామాలకు బంద్‌..

అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద భగీరథ పైప్‌లైన్‌ తొలగించడంతో వంతెన అవతలి వైపు 64 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. అసలే వేసవి కావడంతో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. కాగజ్‌నగర్‌ మండలంతోపాటు కన్నెపల్లి, భీమిని, దహెగాం మండలాల్లో 64 గ్రామాలకు ఈ పైప్‌లైన్‌ ద్వారానే నీటి సరఫరా జరుగుతుంది. నెల రోజులుగా పైప్‌లైన్‌ కనెక్షన్‌ తొలగించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందవెల్లి పెద్దవాగు వంతెన వద్ద అప్రోచ్‌ పనులు మూడు రోజుల క్రితమే పూర్తి చేశారు. అయినా పైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement