● భర్త మరణంతో నలుగురు పిల్లల భారం మోసి..
● కౌలు రైతుగా మారి..
● ఆదర్శంగా తానుబాయి జీవితం
కెరమెరి(ఆసిఫాబాద్): నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత అనారోగ్యంతో భర్త చనిపోయాడు. మనస్తాపంతో తానూ ఈ లోకాన్ని విడిచిపోవాలని అనుకుంది. అయితే పిల్ల లు గుర్తుకొచ్చి ఆగిపోయింది. చిన్నారుల పరిస్థితి ఎలా అని ఆలోచించింది. బాధను దిగమింగుకుని కూలీ పనులు చేసుకుంటూ.. కౌలుకు భూమి సాగు చేస్తూ పిల్లల ను ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆదర్శమూర్తిగా నిలిచింది వాడై తానుబాయి.
వ్యవసాయం చేస్తూ..
కెరమెరి మండల కేంద్రంలోని గోపాల్‌వాడకు చెందిన తానుబాయి భర్త మల్లేశ్ 2011 ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటికే వారికి 11 ఏళ్ల నాగమ ణి, ఏడేళ్ల ఆరుణ, ఐదేళ్ల ప్రియాంకతో పాటు నాలుగేళ్ల కుమారుడు విజయ్ ఉ న్నారు. పిల్లల కడుపు నింపేందుకు కూలీ పనులకు వెళ్లడం ప్రారంభించింది. చిన్నారులను బంధువుల ఇళ్లలో ఉంచేది. కూలీ డబ్బులు సరిపోకపోవడంతో భూమిని కౌ లుకు తీసుకుని సాగు చేయడం ప్రారంభించింది. కొడుకును వీపుపై కూర్చొబెట్టుకుని పనులు చేసేది. క్రమంగా జీవితంలో స్థిరపడి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించింది. కొడుకును కూడా ప్రయోజకుడిగా మార్చేందుకు శ్రమిస్తోంది. మన భయమే వెనుకబాటుతనానికి కారణమని, ధైర్యంతో ముందుకెళ్తే విజయం సాధించవచ్చని తానుబాయి అంటోంది.