పేరు మారేనా? | - | Sakshi
Sakshi News home page

పేరు మారేనా?

May 20 2024 6:25 AM | Updated on May 20 2024 6:25 AM

పేరు మారేనా?

పేరు మారేనా?

● సింగరేణిలో మారు పేర్లపై 3 వేల మంది విధులు ● అన్‌ఫిట్‌, రిటైర్డ్‌ అయ్యాక ఇబ్బందులు ● కన్న బిడ్డలను కూడా నిరూపించుకోలేని దుస్థితి ● ఎన్నికల హామీగా పేర్ల క్రమబద్ధీకరణ

శ్రీరాంపూర్‌: సింగరేణిలో మారు పేర్లతో పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను క్రమబద్ధీకరించాలని చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉంది. దీనిని గుర్తించిన కార్మిక సంఘాలు ఎన్నికల వేళ హామీ ఇస్తున్నాయి. గెలిచాక పట్టించుకోవడం లేదు. కేవలం ఎన్నికల అంశంగానే దీనిని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. దీంతో ఏళ్లు గడుస్తున్నా పేర్ల క్రమబద్ధీకరణకు మోక్షం కలగడం లేదు.

సంస్థ వ్యాప్తంగా 3 వేల మంది..

సింగరేణి వ్యాప్తంగా మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు సుమారు 3 వేల మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరే కాకుండా పనిచేసి ఇప్పటికే రిటైర్‌ అయిన వారు కూడా వేలల్లో ఉన్నారు. మెడికల్‌ బోర్డుకు వెళ్లి అన్‌ఫిట్‌ అయి మారు పేర్ల కారణంగా డిపెండెంట్‌ ఉద్యోగాలు రానివారు మరికొందరు ఉన్నారు. మారు పేర్ల సమస్యతో సంస్థలో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు.

మారు పేర్లు ఎందుకు..

సింగరేణి యాజమాన్యం 1986లో పరుగుపందెం పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నట్లు నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీంతో గ్రామాల్లో నుంచి వేలాది మంది దరఖాస్తులు చేసుకోగా వారికి ఎంప్లాయ్‌మెంట్‌ కార్డులు జారీ అయ్యాయి. కార్డులు వచ్చిన వారిలో కొందరు పరుగుపందెంలో పాల్గొనడానికి ఇష్టపడలేదు. మరి కొందరికి వీలు కాలేదు. తప్పుడు అడ్రస్‌లో మరికొ న్ని రావడంతో వారి స్థానంలో ఇతరులు ఆ కార్డు పట్టుకుని వచ్చి పందెంలో పాల్గొని గెలిచారు. సింగరేణి కొలువు సాధించారు. కార్డులో ఏ పేరు ఉందో అదే పేరుతో ఉద్యోగంలో కొనసాగుతున్నారు. 1990 సమయంలో సింగరేణికి భూములిచ్చిన వారికి కూడా ఉద్యోగాలిచ్చారు. భూములు పోని వారు కూడా పోయిన వారి పేరుతో వచ్చి వారి స్థానంలో ఉద్యోగంలో చేరారు. 1998 వరకు కొందరు సింగరేణి ఉద్యోగాలను కొనుక్కున్నారు. ఇలా వివిధ కారణాలతో వారి గ్రామంలో ఉన్న సొంత పేర్లు కాకుండా మారు పేర్లతో పనిచేస్తున్నారు.

ఆధార్‌ రాకతో తిప్పలు..

గతంలో ఎలా ఉన్నా ఆధార్‌ కార్డు ప్రక్రియ మొదలై న తరువాత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంద రూ వారి గ్రామాల్లో భూములు ఇతర ఆస్తుల కో సం అసలు పేర్లుతో అధార్‌ కార్డులు తీసుకున్నారు. వారి పిల్లల చదువులు, అన్ని సర్టిఫికెట్లు కూడా కంపెనీలో ఉన్నట్లు కాకుండా స్వగ్రామంలో ఉన్నట్లు అసలు పేర్లతో కొనసాగిస్తున్నారు. ఇలా సింగరేణిలో ఒక పేరు, ఊళ్లలో ఒక పేరుతో కొనసాగుతున్నా రు. ఇక మారు పేర్లతో పనిచేసిన వారికి రిటైర్మెంట్‌ తరువాత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పెన్షన్‌ రావాలంటే ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఆధార్‌ కార్డులో ఒక పేరు, కంపెనీలో ఒక పేరు ఉండటంతో పెన్షన్‌ పొందలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది పెన్షన్‌కు దూరంగా ఉన్నారు. మరో పక్క మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే వారిస్థానంలో డిపెండెంట్లకు ఉద్యోగం ఇవ్వడం సమస్యగా మారుతోంది. ఇలా చాలా మంది ఉద్యోగం పొందలేకపోయారు.

ఎన్నికలప్పుడే హామీ...

ఆరో విడత గుర్తింపు సంఘం ఎన్నికల ముందు కే సీఆర్‌ కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఇదొకటి ఉంది. గెలిచిన తరువాత మారు పేర్లతో పనిచేసే వారి పే ర్లు క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో టీబీ జీకేఎస్‌ గెలిచింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. కానీ ఇది అమలు కాలేదు. మళ్లీ ఎన్నికలు వచ్చా యి. టీబీజీకేఎస్‌ ఓడిపోయి ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా వచ్చింది. ఏఐటీయూసీ కూడా ఎన్నికల కు ముందు తాము గెలిస్తే ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ సంఘం నాయకులైనా దీ నిని పరిష్కరిస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది.

విజిలెన్సు కేసులు..

పొరుగు వారితో గొడవ అయితే.. వారు కంపెనీకి ఫలానా ఉద్యోగి మారు పేర్లతో పని చేస్తున్నారంటూ ఫిర్యాదు ఇవ్వడంతో చాలా మంది విజిలెన్సు కేసులు ఎదుర్కొంటున్నారు. మారు పేర్లతో పనిచేసే వారు మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ అయి వారి పిల్ల లకు కారుణ్య ఉద్యోగాలు పెట్టించే ప్రయత్నంలో పేర్లలో తేడా కనిపిస్తే విజిలెన్సు కేసులు నమోదు అవుతున్నాయి. ఇంటి పేరు, తండ్రి పేరు, అభ్యర్థి పేరులో ఏమాత్రం తేడా అనిపించినా అధికారులు విజిలెన్సుకు రాస్తున్నారు. దీంతో కొడుకును కూడా కొడుకుగా నిరూపించుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు పేర్కొంటున్నారు.

సాంకేతిక ఇబ్బందులు..

పేర్లు మార్చడానికి చాలా సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగి పేరును కంపెనీ ఏదైనా గెజిట్‌తో మారిస్తే వారి సీఎంపీఎఫ్‌లో పేర్లు మార్చడం చాలా కష్టం. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కంపెనీ తీసుకునే నిర్ణయం అంతా సులువుగా అమలు చేయడానికి సీఎంపీఎఫ్‌ శాఖ సిద్ధంగా ఉండదు. ఈ ఇబ్బందుల నడుమ మారు పేర్లతో పనిచేసే ఉద్యోగులు వారి భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మారు పేర్లతో పనిచేసే వారు పేర్ల మార్పునకు యాజమాన్యం అనుమతి ఇచ్చినా తమకు తాము మారుపేర్లతో పనిచేస్తున్నామని చెప్పుకోరని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

యాజమాన్యంతో చర్చిస్తాం

మారుపేర్లతో పనిచేసే వారి పేర్లను క్రమబద్ధీకరించాలి. చాలా మంది కార్మికులు దీనితో ఇబ్బందులు పడుతున్నారు. కారుణ్య ఉద్యోగాలు ఇప్పించుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్‌ అయ్యాక పెన్షన్‌ పొందలేకపోతున్నారు. దీనిపై యాజమాన్యంతో చర్చించి న్యాయం చేసేలా చూస్తాం.

వి.సీతారామయ్య, ఏఐటీయూసీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement