ఆటో, కారు ఢీ: ఇద్దరు మృతి

- - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): రెబ్బెన మండలం పులికుంట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన మువ్వ శ్రీధర్‌ తన తల్లి మాలతికి హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయించి శుక్రవారం సోదరి సునీతతో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. వీరితోపాటు మరో ఇద్దరు చిన్నారులు కారులో ఉన్నారు. అలాగే బెల్లంపల్లి పట్టణంలోని 65 డీప్‌ ఏరియాకు చెందిన ఆటో డ్రైవర్‌ ఎండీ దస్తగిరి(45) ఆటోలో ప్రయాణికులతో రెబ్బెన వైపు నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్నాడు.

గోలేటి ఎక్స్‌రోడ్‌ వద్ద ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఇద్దరు పిల్లలతో కలిసి మొత్తం ఏడుగురితో బెల్లంపల్లి వైపు పయనమయ్యాడు. ఈ క్రమంలో పులికుంట సమీపంలో ఎదురుగా వస్తున్న కారు, దస్తగిరి నడుపుతున్న ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోతోపాటు కారులో ఉన్న ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో దస్తగిరితోపాటు అదే ఆటోలో ఉన్న రేపల్లెవాడకు చెందిన రాంసింగ్‌(58) మంచిర్యాలలో మృతి చెందాడు.

బతుకుదెరువు కోసం వచ్చి..
రాంసింగ్‌ తాండూర్‌ మండలం రేపల్లెవాడలో కుమారుడితో కలిసి ఉంటున్నాడు. స్వగ్రామానికి వెళ్లి వస్తూ రెబ్బెనలో ఆటో ఎక్కగా.. పులికుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

క్షతగాత్రులు వీరే..
ఈ ప్రమాదంలో రెబ్బెన మండలం కై రిగూడకు చెందిన మినుగు చిలుకమ్మ, గోలేటికి చెందిన వడాయి నానుబాయి, మహారాష్ట్రలోని గుగ్గూస్‌కు చెందిన అరుణారాణి, మువ్వ మాలతి, శ్రీధర్‌, సునీత తీవ్రంగా గాయపడ్డారు. పిల్లలకు కావాల్సిన యూనిఫాం, స్కూల్‌బ్యాగులు కొనేందుకు నానుబాయి, చిలుకమ్మ బెల్లంపల్లికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. అదే ఆటోలో ఉన్న అరుణారాణి తన కూతురుతో కలిసి వెళ్తుండగా గాయపడ్డారు. చిన్నారులకు ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న రెబ్బెన ఎస్సై భూమేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో క్షతగాత్రులను ప్రైవేటు అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించారు. నానుబాయి, చిలుకమ్మని మొదట రెబ్బెన పీహెచ్‌సీకి.. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలించగా, అరుణారాణిని మంచిర్యాలకు తరలించారు.

Read latest Komaram Bheem News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top