
జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ కోదండ రామాలయం
● నేడు జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో శ్రీసీతారాముల కల్యాణం ● ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని జానకీపురం(జన్కాపూర్) కోదండ రామాలయం శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కల్యాణానికి ముస్తాబైంది. వారం రోజులపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో భూమి చదును చేశారు. షామియానాలు, చలువ పందిళ్లు వేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. జన్కాపూర్ నుంచి ఆసిఫాబాద్ వరకు సీతారాముల కల్యాణ మంత్రోచ్ఛరణలు వినిపించేలా రాష్ట్రీయ రహదారి పొడవునా మైక్‌లు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం రాజంపేటకు చెందిన తుజాల్‌పూర్ మురళీగౌడ్ నివాసం నుంచి కోదండ రామాలయం వరకు ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
ఆలయ చరిత్ర
కాకతీయుల దీక్షాదక్షతలకు గుర్తుగా ఏడెనిమిది దశాబ్దాలుగా జన్కాపూర్ కోదండ రాముడికి పూజలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో నిర్మించిన త్రికుటాలయం పూర్తిగా శిథిలమైంది. ఈ క్రమంలో ఒకప్పటి జనగామ, ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో స్వర్గీయ రాంచందర్‌రావు పైకాజీ 1970లో ఆలయ నిర్మాణం చేపట్టి సీతారాముల విగ్రహాలు ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయంలో ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు నెరవేరడంతో ఆలయం నిత్యం భక్తులతో కోలాహలంగా ఉంటుంది. పర్వదినాల్లో అన్నదానాలు, భజ నలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతా యి. గణేశ్ నవరాత్రుల్లో వినాయకుడు, దుర్గా నవరాత్రుల్లో శారదామాత విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సహకారంతో జన్కాపూర్ వాసులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని మళ్లీ పునర్నిర్మించారు. ఆలయంలో సీతారాముల విగ్రహాలతోపాటు శివలింగం, షిర్డీ సాయినాథుడు, ఈశాన్యంలో నవగ్రహాలను ప్రతిష్టించారు. దాతల సహకారంతో కల్యాణ మంటపం కూడా నిర్మించారు.
నేడు సీతారాముల కల్యాణం
ఆలయంలో గురువారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 4.30 గంటలకు సీతారాములకు అభిషేకం, 9 గంటలకు ఆసిఫాబాద్ నుంచి ఆలయం వరకు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో హనుమాన్ దీక్షాస్వాముల శోభాయాత్ర, 11 గంటలకు కల్యాణ ఘట్టం ప్రారంభం, 11.30 గంటలకు కన్యాదానం, మధ్యాహ్నం 12.15 గంటలకు సీతారాముల కల్యాణం, అనంతరం మహాప్రసాదం(అన్నదానం), సాయంత్రం 6 గంటలకు పల్లకిసేవ, రాత్రి 8 గంటలకు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేపడుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేసవి ప్రతాపం నుంచి ఉపశమనం కోసం ఆలయం వద్ద బెల్లం పానకం, మజ్జిగ, తాగునీటిని అందుబాటులో ఉంచనున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గురువారం నిర్వహించే కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

ఆలయంలో కొలువుదీరిన సీతారాములు