వర్షాలు మొదలైతే..
2,300 ఇన్‌ఫెక్షన్ చాంబర్లలో
512 మాత్రమే నిర్మాణం
మరో 11 నెలల్లో ముగియనున్న
ప్రాజెక్టు కాలవ్యవధి
వర్షాలు మొదలైతే పనుల్లో
మరింత జాప్యం
మధిర: మధిర మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా మారిన పారిశుద్ధ్య సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐడీసీ) ద్వారా ఈ పనులకు రూ.128 కోట్లు మంజూరయ్యాయి. ఈమేరకు 99.56 కి.మీ. మేరకు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించాలని ప్రతిపాదించారు. పైప్‌లైన్ విధానంతో నిర్మించే ఈ ప్రాజెక్టు పూర్తయితే మధిరలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
పారిశుద్ధ్య సమస్యకు చెక్ పెట్టేలా..
రాష్ట్రంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ విధానం రెండు, మూడుచోట్ల మాత్రమే ఉంది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉన్న మల్లు భట్టి విక్రమా ర్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో మధిర మున్సిపాలిటీ ఒకటే ఉండడంతో ఇక్కడ యూజీడీ అమలుకు నిర్ణయించారు. ఈ మున్సిపాలిటీలో 6,638నివాస గృహాలు ఉండగా, ఏటా నూతన కాలనీలు ఏర్పడుతున్నాయి. దీంతో మురుగునీరు సాఫీగా వెళ్లడం, బయటకు మురుగు కనిపించకుండా యూజీడీ నిర్మాణానికి సంకల్పించారు. తద్వారా ఈగలు, దోమల వృద్ధి, దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యకు శాశ్వతంగా చెక్ పడుతుందని భావించారు. నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని స్వయంగా డిప్యూటీ సీఎం పలుమార్లు కాంట్రాక్టర్‌కు సూచించినా ఆశించిన ఫలితం కానరావడం లేదు.
అడుగడుగునా అవాంతరాలు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్‌లైన్ నిర్మాణానికి సీసీ రోడ్లను పగలగొట్టారు. ఆ తర్వాత కొన్నిచోట్ల పైప్‌లైన్ వేసినా రోడ్డు మధ్యలో ఉన్న కందకాలను పూడ్చకపోవడంతో లోతైన గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేదు. జిలుగుమాడు, ఇల్లందులపాడు, ఆర్‌సీఎం చర్చ్ వెనుక భాగం తదితర ప్రాంతాల్లో కనీసం పాదచారులు కూడా రోడ్డుపై నడిచే వీలు లేకుండా రహదారులు తయారయ్యాయి. రోడ్ల ధ్వంసంతో టీచర్స్‌కాలనీలోకి 108 అంబులెన్స్ సకాలంలో చేరక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మృతి చెందాడు. పగలగొట్టిన రోడ్లకు కాంట్రాక్టర్ తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది.
ఏడాదిలో 45 శాతమే..
యూజీడీ నిర్మాణానికి కేటాయించిన రూ.128 కోట్లలో రూ.121 కోట్లు ప్రాజెక్టు వ్యయం కాగా, మిగతా రూ.7 కోట్లను ఐదేళ్ల పాటు నిర్వహణకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే, మొత్తం 99.56 కి.మీ. పైప్‌లైన్‌కు గాను 49 కి.మీ. మాత్రమే భూమిలో పైప్‌లైన్ వేశారు. అలాగే, మధిర, మడుపల్లి, అంబారుపేట, ఇల్లెందులపాడును నాలుగు జోన్లుగా విభజించి నాలుగు సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (ఎస్‌టీపీ) నిర్మించి మురుగునీటిని మళ్లించాల్సి ఉండగా భూసేకరణ కూడా పూర్తికాలేదు. ఇటీవల ప్రభుత్వ స్థలాల్లో ఎస్‌టీపీలు నిర్మించాలని నిర్ణయించినా ఇంకా ఖరారు కాలేదు. అలాగే, 2,300 ఇన్‌ఫెక్షన్ చాంబర్లకు గాను కేవలం 512 మాత్రమే నిర్మించారు. రెండేళ్ల కాలవ్యవధిలో ఏడాది పూర్తయినా 40శాతం పనులు కూడా కాకపోవడం గమనార్హం.
నాణ్యతతో గడువులోగా..
యూజీడీ పనుల్లో జాప్యంపై మున్సిపల్ డీఈ నవీ న్‌ను వివరణ కోరగా.. గడువులోగా నాణ్యతతో పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. టీచర్స్‌కాలనీ, ముస్లింకాలనీ తదితర ప్రాంతాల్లో వేసవి ముగిసేలోగా పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. పనులు వేగంగా చేపట్టకపోవడం, నిబంధనల మేరకు సిల్ట్ నింపకపోవడంతో కాంట్రాక్టర్‌కు బిల్లులు చేయలేదని తెలిపారు.
త్వరలోనే వానాకాలం రానుంది. ఇన్నాళ్లు పనుల్లో జాప్యం కాగా.. కాంట్రాక్టర్ ఇప్పుడిప్పుడే ముస్లిం కాలనీ, ఎస్సీ కాలనీ, మడుపల్లిలో యూజీడీ పనులు చేయిస్తున్నారు. వేసవిలోనే మట్టి రోడ్లు ఉన్నచోట పైప్‌లైన్లు వేసి కందకాల్లో గ్రావెల్ నింపితే ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఉండదు. కానీ సుందరయ్యనగర్, టీచర్స్‌కాలనీ తదితర ప్రాంతాల్లో మట్టి రోడ్లపై మ్యాన్‌హోళ్లు, ఇన్‌ఫెక్షన్ చాంబర్ల నిర్మాణం చేపట్టలేదు. ఈ ప్రాజెక్టును 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా.. గడువు మరో 11 నెలల్లో పూర్తవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే గడువులోగా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
మధిరలో నత్తనడకన
అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులు


