ఖమ్మంఅర్బన్: గ్రానైట్ పరిశ్రమలకు రాష్ట్రప్రభుత్వం పెండింగ్ సబ్సిడీలు విడుదల చేయడంతో ఈ రంగానికి కొత్త ఊపిరి పోసినట్లయిందని రాష్ట్ర గ్రానైట్ చిన్నతరహా పరిశ్రమల అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చొరవ, తమ పోరాటంతో సుమారు రూ.20.60 కోట్ల సబ్సిడీలు 176 ఫ్యాక్టరీలకు నేరుగా జమ అయ్యాయని వెల్లడించారు. గత 12 ఏళ్లుగా పెండింగ్ ఉన్న విద్యుత్ సబ్సిడీ, ప్రోత్సాహకాలు, వడ్డీ రాయితీ విడుదల చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2004లో నాటి సీఎం వైఎస్.రాజశేఖర్‌రెడ్డి అమలుచేసిన శ్లాబ్ విధానంతో గ్రానైట్ పరిశ్రమలు నిలదొక్కుకోగా, ఇప్పుడు సబ్సిడీల విడుదలతో మరోసారి ఊతమిచ్చినట్లయిందని చెప్పారు. ఇదేసమయాన ముడిసరుకు సమస్య పరిష్కరించడంతో పాటు ప్రభుత్వ నిర్మాణాల్లో గ్రానైట్ వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు. అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సాధు రమేష్‌రెడ్డి మాట్లాడుతూ సబ్సిడీలు విడుదల చేసిన సీఎం, మంత్రులకు రుణపడి ఉంటామన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పాటిబండ్ల యుగంధర్, గోపాల్‌రావు, నాయకులు పరమేష్‌రెడ్డి, రమేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు రాయల నాగేశ్వరరావు


