చెప్పేదెవరు.. వినేదెవరు? | - | Sakshi
Sakshi News home page

చెప్పేదెవరు.. వినేదెవరు?

Apr 3 2026 7:14 AM | Updated on Apr 3 2026 7:14 AM

● గాడి తప్పిన మార్కెటింగ్‌ శాఖ ● రైతు ప్రయోజనాలను విస్మరించి వ్యాపారులకే సహకారం ● పన్నుల వసూళ్లలోనూ వెనుకబాటు ● ఉద్యోగులపై అజమాయిషీ కరువై ఇష్టారాజ్యం

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

ఉత్పత్తి, ధరలు తగ్గడంతోనే..

● గాడి తప్పిన మార్కెటింగ్‌ శాఖ ● రైతు ప్రయోజనాలను విస్మరించి వ్యాపారులకే సహకారం ● పన్నుల వసూళ్లలోనూ వెనుకబాటు ● ఉద్యోగులపై అజమాయిషీ కరువై ఇష్టారాజ్యం

ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ గాడి తప్పిందా అన్న ప్రశ్నకు ఔననే సమాధానమే వస్తోంది. రైతుల ప్రయోజనాల కోసం నెలకొల్పబడిన మార్కెట్లలోని అధికారులు ఆ పనిని పక్కన పెట్టి వ్యాపారుల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదేకాక పన్నుల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో 15 మార్కెట్లకు గాను ఖమ్మం జిల్లాలో తొమ్మిది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆరు మార్కెట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మిర్చి, అపరాలు పంటలే కాక ఉద్యాన పంటల సాగులోనూ రైతులు ముందంజలో నిలుస్తున్నారు. ఈనేపథ్యాన వ్యవసాయ మార్కెట్లు రైతులకు మద్దతు ధర దక్కేలా కృషి చేస్తూ మార్కెటింగ్‌ శాఖకు ఆదాయాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగుల పట్టింపులేని తనం, అధికారుల అజమాయిషీ లోపించడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కొన్నిచోట్ల కమిటీలే పూర్తి పెత్తనం చెలాయిస్తుండడంతో పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలుస్తోంది.

వ్యాపారుల అక్రమాలకు అండ

రైతులకు మేలు చేయాల్సిన అధికారులు పూర్తిగా వ్యాపారుల అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుల వద్ద పంటలను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న కొందరు వ్యాపారులు.. బినామీల పేరిట తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించడం వెనుక ఉద్యోగుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లలో ఇలాంటి అక్రమాలు వెలుగు చూడడం ఇందుకు నిదర్శంగా నిలుస్తోంది. గత ఏడాది తాతాల్కి క రిజిస్ట్రేషన్ల(టీఆర్‌) పేరిట పంట విక్రయాలకు రైతులకు అవకాశం కల్పించగా, మార్కెట్‌ ఉద్యోగులు వ్యాపారులకు కట్టబెట్టినట్లు బయటపడింది. దీంతో భద్రాచలం మార్కెట్‌ కార్యదర్శిపై వేటు పడింది. ఇదే ఘటనలో మరికొందరు ఉద్యోగులపైనా విచారణలు కొనసాగుతోంది. అయినా ఈ ఏడాది కూడా పత్తి విక్రయాల్లో వ్యాపారుల ఆధిపత్యమే కొనసాగడం గమనార్హం.

లక్ష్యం చేరని వసూళ్లు

ఏటా మార్కెటింగ్‌ శాఖ మార్కెట్ల వారీగా ఫీజు వసూళ్లకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. ఈసారి ఖమ్మం జిల్లాలో రూ.70 కోట్ల లక్ష్యానికి రూ.45 కోట్లు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో రూ.20 కోట్ల లక్ష్యానికి గాను రూ.15 కోట్లకు మించకపోవడం గమనార్హం. వ్యాపారులు కొందరు పంట కొనుగోళ్లలో జీరో దందాకు పాల్పడుతూ ఫీజు కట్టడం లేదని తెలిసినా అధికారులు, ఉద్యోగులు పట్టించుకోకపోవడంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది.

అధికారుల అజమాయిషీ కరువవడంతో పలు మార్కెట్లలోని ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొందరు అసలు విధులకే హాజరుకావడం లేదని తెలుస్తోంది. ఇటీవల మార్కెట్‌ కార్యదర్శి పంతులు మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి తనిఖీల్లో తేలింది. అయినా చర్యలు తీసుకోకపోగా, చివరకు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ మందలించడంతో విచారణ చేపట్టారు. ఇక పత్తి విక్రయాల్లో జరిగిన అక్రమాలపై భద్రాచలం కార్యదర్శిపై వేటు వేసి జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్‌కు బదిలీ చేశారు. అయితే, ఆయన తిరిగి ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటైన మత్కేపల్లి మార్కెట్‌ కార్యదర్శిగా రావడం గమనార్హం. ఇలాంటి ఘటనలను పరిశీలిస్తే అక్రమాలకు పాల్పడే వారికి శాఖలో పెద్దల అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాక ఇల్లెందు మార్కెట్‌లో ఉద్యోగులు – పాలకవర్గానికి మధ్య సమన్వయం లోపించడంతో ఇద్దరు ఉద్యోగులను అదర్‌ డ్యూటీ పేరిట కొత్తగూడెం డీఎంఓ, వరంగల్‌ డీడీ కార్యాలయానికి పంపించారు.

ఈ ఏడాది పంటల ఉత్పత్తి తగ్గింది. దీనికి తోడు ధరలు కూడా లేవు. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన మేర ఫీజుల లక్ష్యాన్ని చేరలేదు. నేలకొండపల్లి మార్కెట్‌ కార్యదర్శి మద్యం మత్తులో విధులకు హాజరైన ఘటనపై విచారణ చేపట్టాం. త్వరలోనే ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాం.

– ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement