అడుగడుగునా ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా ఆంక్షలు

Mar 28 2026 7:22 AM | Updated on Mar 28 2026 7:22 AM

● ప్రముఖులకూ తప్పని అడ్డంకులు ● ఖమ్మం జడ్జి, రామదాసు వారసుడికి సైతం అనుమతి నిరాకరణ

● ప్రముఖులకూ తప్పని అడ్డంకులు ● ఖమ్మం జడ్జి, రామదాసు వారసుడికి సైతం అనుమతి నిరాకరణ

భద్రాచలం/భద్రాచలంఅర్బన్‌: భద్రాచలంలో శుక్రవారం జరిగిన శ్రీసీతారామచంద్ర స్వామి కల్యాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. పలువురు మంత్రుల, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు 36 గంటల ముందు నుంచే ఆంక్షలు విధించారు. రామాలయానికి వెళ్లే దారిలో ముఖద్వారం వద్ద సీఎం కాన్వాయ్‌లోని వాహనాలనే అనుమతించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. అలాగే, సీఎం రేవంత్‌రెడ్డి కల్యాణంలో పాల్గొనడానికి సారపాక నుంచి భద్రాచలం వస్తున్నారని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ట్రాఫిక్‌ 30 నిమిషాల పాటు నిలిపివేశారు. కల్యాణం ముగిశాక కూడా మరో పావు గంట, ఆతర్వాత బ్రిడ్జి సెంటర్‌ నుంచి సారపాక వెళ్లే వాహనాలను మళ్లించే క్రమాన ప్రతి 15 నిమిషాలకు వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

ప్రముఖులకూ తప్పలేదు..

సీఎం పర్యటన నేపథ్యాన పటిష్ట బందోబస్తు ఉన్నా, పలు చోట్ల శ్రుతిమించడంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. వీఐపీలు, వీవీఐపీలకు సైతం ఈ బెడద తప్పకపోవడం గమనార్హం. స్వయాన భద్రాచలం ఆలయ ఈఓ దామోదర్‌రావు ఆలయానికి వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి అడ్డుకోగా.. సిబ్బంది సర్దిచెప్పినా దురుసుగా ప్రవర్తించినట్లు తెలిసింది. మిథిలా స్టేడియంలో కల్యాణానికి వస్తున్న ఖమ్మం ఫ్యామిలీ కోర్టు జడ్జి అర్చనాకుమారిని ట్రెయినీ కలెక్టర్‌ సౌరభ్‌ శర్మ అడ్డుకున్నారు. పాస్‌ చూపించినా వినకపోవడంతో ఆమె భద్రాచలం జడ్జిని కలిసి.. ఆ తర్వాత సెక్టార్‌లోకి వెళ్లారు. ఇక భక్త రామదాసు వారసుడిగా దేవస్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనే కంచర్ల శ్రీనివాసరావు దంపతులను సైతం అడ్డుకోవడం విమర్శలకు తావిచ్చింది. పాస్‌, అనుమతి పత్రాలను చూపించినా అధికారులు ససేమిరా అనడంతో గంట అనంతరం పలువురు చెప్పడంతో అనుమతించారు. ఇదే సమయాన పోలీసు సిబ్బంది, చోటామోటా రాజకీయ నాయకులను మాత్రం అడ్డగోలుగా సెక్టార్లలోకి అనుమతించటం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement