కీలక ఘట్టాలు
అశేష భక్తజనంతో పులకించిన భద్రగిరి
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు
ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ
భక్తుల జయజయ ధ్వానాలు.. శ్రీరామనామ స్మరణ.. వేద మంత్రోచ్ఛరణల నడుమ.. అభిజిత్ లగ్నంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పోటెత్తగా, మిథిలా స్టేడియం కిక్కిరిసింది. రామయ్య స్వామి, సీతమ్మ తల్లి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. సీఎం రేవంత్‌రెడ్డి సతీ సమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. – భద్రాచలం
సంప్రదాయబద్ధంగా ఉదయం 8 గంటల సమయంలో గర్భగుడిలో మూల మూర్తులకు లఘు కల్యాణం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం, శ్రీయోద్వాహం, యోక్త్రాబంధనం, అలంకరణ, కన్యాదానం పూజలు గావించి.. అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం ఉంచి పెళ్లి తంతు కొనసాగించారు. మధ్యాహ్నం 12:13 గంటలకు మాంగళ్య ధారణ జరగగా ఆ తర్వాత తలంబ్రాలు పోసి, హారతి ఇవ్వడంతో వివాహ తంతు ముగిసింది. చివరగా సీతారాములను గరుడ, గజ వాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగించారు.
సీఎం హోదాలో తొలిసారిగా 2025 భద్రాచలంలో జరిగిన కల్యాణానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో ప్యాంట్, షర్ట్‌లో ఆయన నేరుగా ఆలయానికి చేరుకున్నారు. గర్భగుడిలో పూజలు నిర్వహించాలంటే పంచె తప్పనిసరి. దీంతో ఆయన ఆలయ ప్రాంగణంలో పంచె ధరించారు. ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్ నుంచే పంచె, షర్ట్ ధరించి భద్రాచలానికి బయలుదేరారు. అదే వస్త్రధారణలో ఆలయ దర్శనం, భూమిపూజ, కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎం దంపతులు అందజేశారు.
సీతారాముల కల్యాణం చూసేందుకు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. మిథిలా స్టేడియం నిండిపోయింది. కల్యాణ వేడుకల్లో దేవేరులు వచ్చినప్పుడు, ఆభరణాలు ధరింప చేసినప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు భక్తితో తన్మయత్వం చెందారు. స్థానికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విరివిగా చలివేంద్రాలు ఏర్పాటుచేయడంతో పాటు అన్నదానం నిర్వహించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పుచ్చకాయలు అందజేశారు. పానకం, మజ్జిగ కేంద్రాల్లో కోలాహలం నెలకొంది. సీఎం రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలపై ఆంక్షలు విధించారు. అంతకుముందే దేవస్థానానికి చేరుకునే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు కట్టడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
వేడుకలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో పాటు ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య హాజరయ్యారు. డీజీపీ శివధర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంతరావు, కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఉదయం 9:58 : కల్యాణ మండపానికి
దేవేరుల ఆగమనం
ఉదయం 10:25 : విశ్వక్సేన పూజ
ఉదయం 10:43 : పుణ్యావాచనం
ఉదయం 10:55 : శ్రీయోద్వాహం
ఉదయం 11:18 : యోక్త్రా బంధనం,
యజ్ఞోపవీత ధారణ
ఉదయం 11:25 : శ్రీరాముడి కాళ్లు కడిగిన జనక మహారాజు
ఉదయం 11:30 : అలంకరణ
ఉదయం 11:32 : మధుపర్క నివేదన
ఉదయం 11:37 : మహా సంకల్పం
ఉదయం 11: 50 : కన్యాదానం
ఉదయం 11:51 : పట్టు వస్త్రాలు సమర్పించిన
సీఎం రేవంత్‌రెడ్డి
మధ్యాహ్నం 12:00 : అభిజిత్ లగ్నంలో వధూవరులపై జీలకర్ర బెల్లం
మధ్యాహ్నం 12:11: మాంగళ్య ధారణ
మధ్యాహ్నం 12:24 : తలంబ్రాలు
మధ్యాహ్నం 12:40 : హారతి
వైభవోపేతంగా సీతారాముల కల్యాణం


