● చివరి ఫలసాయంపై ‘సీతారామ’ నిర్వాసితుల ఆశలు ● పరిహారం ఇచ్చాం.. ప్రభుత్వానిదే అంటున్న యంత్రాంగం ● మంత్రులు, కలెక్టర్ చొరవ చూపాలని వేడుకోలు
కారేపల్లి: ఏళ్ల తరబడి వ్యయప్రయాసలకోర్చి సాగు చేసిన సుబాబుల్ పంట చేతికి వచ్చిందని, ఆ పంటను చివరిసారి తీసుకునే హక్కు తమకే కల్పించాలని సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసిత రైతులు కోరుతున్నారు. అయితే, ఇప్పటికే నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమ అయినందున ఫలసాయం ప్రభుత్వానికే చెందుతుందని అధికారులు అడుగడుగునా అడ్డుకుంటుండడంతో ఆందోళనలు జరుగుతున్నాయి. అంతేకాక తమను అడ్డుకుంటున్న అధికారులు బెదిరింపులకు పాల్పడడమే కాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా మంత్రులు, కలెక్టర్ స్పందించి సన్నకారు రైతులమైన తమకు చివరి ఫలసాయం దక్కేలా చూడాలని కోరుతున్నారు.
168 ఎకరాల సేకరణ
సీతారామ ప్రాజెక్టు ప్యాకేజీ– 13లో భాగంగా కాల్వ నిర్మాణానికి పలువురు రైతుల నుంచి ప్రభుత్వం భూమి సేకరించింది. సింగరేణి మండలంలో రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం రెవెన్యూ పరిధిలో 168 ఎకరాలను సుమారు 100మంది రైతుల వ్యవసాయ భూములను సేకరించారు. అంతేకాక నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ.18.50లక్షల చొప్పున పరిహారం జమ చేశారు. అలాగే, వ్యవసాయ భూముల్లో బోర్లు, పైపులైన్లు, డ్రిప్ పరికరాలు, ఫెన్సింగ్‌కు పరిహారం చెల్లించారు.
పదేళ్లకు పైగా కష్టం
ఇక్కడి రైతులు 10నుంచి 15ఏళ్లు కష్టపడి సాగు చేయగా సుబాబుల్ తోటలు చేతికి వచ్చాయని చెబుతున్నారు. భూమి సేకరించి పరిహారం చెల్లించి న మాట వాస్తవమే అయినా అది గిట్టుబాటు కాద ని.. దీనికి తోడు చేతికి వచ్చిన పంట తీసుకోకుండా అడ్డుకోవద్దని కోరుతున్నారు. ప్రస్తుతం సుబాబుల్ టన్నుకు రూ.8వేల వరకు ధర పలుకుతున్నందున తమకే దక్కేలా చూడాలని విన్నవిస్తున్నారు.
అధికారుల వాదన ఇలా...
రేలకాయలపల్లి రెవెన్యూ పరిధి 67ఎకరాల్లో సువాబుల్ తోటలను 36మంది రైతులు నరికిస్తుండగా అధికారులు ఇటీవల అడ్డుకున్నారు. అలాగే, కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు తమపై బెదిరింపులను అరికట్టి చివరిపంట తీసుకునేలా మంత్రులు, అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ఇదే సమయాన అధికారులు మాత్రం చీమలపాడు, బాజుమల్లాయిగూడెం తదితర ప్రాంతాల్లో సుబాబుల్ కోత తామే చేపట్టి టెండర్ ద్వారా ఐటీసీకి అప్పగించినట్లు చెబుతున్నారు. మిగతా పంట కూడా టెండర్ ద్వారా ఇస్తామని చెబుతుండగా.. రైతులు చివరి పంట తామే తీసుకుంటామని ముందుకొస్తుండడంతో వాగ్వాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ విషయమై జలవనరుల శాఖ వైరా డివిజన్ ఈఈ బాబురావు వివరణ కోరగా... భూసేకరణలో భాగంగా భూమితో పాటు పంటలకు కూడా పరిహారం చెల్లించామని తెలిపారు. రెవెన్యూ శాఖ పంచనామా అనంతరం భూమి స్వాధీనం చేసుకుని అందులో సుబాబుల్‌ను టెండర్ ద్వారా ఐటీసీకి అప్పగించామని వెల్లడించారు. కానీ రైతులు అడ్డుకుంటుండడంతో సమస్య నెలకొందని తెలిపారు.


