మళ్లీ ‘సాగర్‌’ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘సాగర్‌’ కష్టాలు

Feb 11 2026 7:26 AM | Updated on Feb 11 2026 7:26 AM

మళ్లీ ‘సాగర్‌’ కష్టాలు

మళ్లీ ‘సాగర్‌’ కష్టాలు

● వారబందీ విధానంతో అందని సాగునీరు ● చివరి ఆయకట్టులో పంటల సాగుకు ఇక్కట్లు ● ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు షెడ్యూల్‌ ప్రకారమే విడుదల

● వారబందీ విధానంతో అందని సాగునీరు ● చివరి ఆయకట్టులో పంటల సాగుకు ఇక్కట్లు ● ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు

ఖమ్మం అర్బన్‌: నాగార్జునసాగర్‌ కాల్వల పరిధి చివరి ఆయకట్టు రైతులకు సాగునీటి సమస్యలు మొదలయ్యాయి. యాసంగి సీజన్‌ మధ్యలోనే నీటి కొరత తలెత్తడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. చివరి భూములకు సక్రమంగా నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమాన సోమవారం కొణిజర్ల మండలంలో రైతులు ఆందోళనకు దిగగా, ఏపీ ప్రాంత రైతులు మంగళవారం బోనకల్‌లో రాస్తారోకో నిర్వహించారు.

2.55లక్షల ఎకరాల ఆయకట్టు

సాగర్‌ నుంచి జిల్లాలోని 17 మండలాల పరిధిలో సుమారు 2.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది. ఏప్రిల్‌ 4వరకు నీటి విడుదల కొనసాగించాలని అధికారులు నిర్ణయించినా ప్రస్తుత పరిస్థితి చూస్తే కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారబందీ విధానం అమలుచేస్తుండడంతోనే చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదని చెబుతున్నారు. ఈసారి వర్షాకాలంలో అధిక వర్షాలు కురవడంతో సాగర్‌ డ్యాంలో పుష్కలంగా నీరు చేరింది. దీంతో రైతులు ఆశగా యాసంగి పంటలు సాగు చేపట్టారు. ప్రధానంగా మధిర, వైరా నియోజకవర్గాల్లోని సాగర్‌ ఆయకట్టు పరిధిలో అధిక విస్తీర్ణంలో వరి, మొక్కసాగు జరుగుతోంది. అయితే, కల్లూరు, మధిర, బోనకల్‌, కొణిజర్ల మండలాల పరిధి బ్రాంచ్‌ కాలువల్లో పూడిక, కంపచెట్లు అడ్డుపడడంతో నీరు సాఫీగా ముందుకు సాగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్‌కు ముందే ఈ సమస్యను పరిష్కరిస్తే ఇబ్బంది ఎదురయ్యేది కాదని అభిప్రాయపడుతున్నారు.

ఏపీ మీదుగా వస్తుండడంతో...

బోనకల్లు–మధిర బ్రాంచ్‌ కాల్వల పరిధిలో సుమారు 10 కి.మీ. మేర ఏపీ ఆయకట్టుకు కూడా నీరు వెళ్తుంది. ఆతర్వాత తెలంగాణకు చేరే క్రమాన అక్కడి రైతులు ఎక్కువగా వినియోగిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఏపీ ప్రాంత రైతులు మంగళవారం బోనకల్‌లో ఆందోళనకు దిగిన నేపధ్యాన సమస్యకు కారణాలు అంతుపట్టడంలేదు. సాగర్‌ నుంచి పాలేరుకు సుమారు 4,300క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 2,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులో 2వేల క్యూస్కెల వరకు జిల్లా అయకట్టు అవసరాలకు, 800 క్యూసెక్కులు ఏపీ అయకట్టుకు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన కాల్వలో నీటి సరఫరా కొనసాగుతున్నా బ్రాంచ్‌ కాల్వల విషయంలో స్పష్టమైన షెడ్యూల్‌, పర్యవేక్షణ అమలుచేయకపోతే ఇక్కట్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నీటి విడుదలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

జిల్లాలోని ఆయకట్టుకు సాగర్‌ జలాలను ముందుగా నిర్ణయించిన వారబందీ షెడ్యూల్‌ ప్రకామే విడుదల చేస్తున్నాం. చిన్నచిన్న సమస్యలు తప్ప ఎక్కడా సమస్య ఎదురుకావడం లేదు. ఆయకట్టు అంతటికీ నీరు అందేలా మా శాఖ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

– ఎం.వెంకటేశ్వర్లు, ఎస్‌సీ, జలవనరులశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement