విద్యుత్ సేవల్లో డిజిటల్ విప్లవం
గూగుల్ మ్యాప్‌లో జిల్లా గ్రిడ్ సమాచారం
సులువుగా ఉద్యోగులు, సిబ్బంది విధులు
‘స్మార్ట్’గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఖమ్మంవ్యవసాయం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఖమ్మం విద్యుత్ సర్కిల్ మరో అడుగు ముందుకు వేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం, ఉద్యోగుల విధులు సులువయ్యేలా డిజిటల్ గ్రిడ్ మ్యాప్‌ను రూపొందించింది. ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి మార్గదర్శకత్వంలో సిద్ధమైన ఈ మ్యాప్‌ను గూగుల్ మ్యాప్‌తో అనుసంధానించారు. డిజిటల్ మ్యాప్‌లో జిల్లాలోని 33 కేవీ సబ్‌స్టేషన్లు, అనుబంధ 11 కేవీ, 33 కేవీ లైన్లతో పాటు ట్రాన్స్‌కో పరిధిలోని 132, 220, 400 కేవీ విద్యుత్ లైన్ల వివరాలు పొందుపరిచారు. తద్వారా విద్యుత్ నెట్‌వర్క్ మొత్తం ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చింది.
క్యూఆర్ కోడ్ ద్వారా సేవలు
ప్రత్యేకంగా రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే సిబ్బందికి అవసరమైన సబ్ స్టేషన్ లేదా లైన్ ప్రాంతానికి గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్లే అవకాశముంటుంది. దీంతో సమస్య ఎదురైన ప్రాంతాన్ని గుర్తించడంలో ఎదురవుతున్న తిప్పలు తప్పనున్నాయి. ఈక్రమాన ఉద్యోగుల సమయం ఆదా అవుతుందని, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం, వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించవచ్చని చెబుతున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రజలకు అందించే సేవలను మెరుగుపర్చడమే లక్ష్యం. ఇందులో భాగంగానే డిజిటల్ గ్రిడ్ మ్యాప్‌ను రూపొందించాం. భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలతో విద్యుత్ రంగంలో స్మార్ట్ జిల్లాగా తీర్చిదిద్దుతాం. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్‌ఈ
విద్యుత్ సేవల్లో డిజిటల్ విప్లవం
విద్యుత్ సేవల్లో డిజిటల్ విప్లవం


