విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
ఇల్లెందురూరల్/కారేపల్లి: ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధి ఐటీఐ సమీపాన పనులు చేస్తున్న కేబుల్ ఆపరేటర్ జువ్వాజి లాలయ్య (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సుభాష్‌నగర్ నుంచి లలితాపురం వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇటీవల కొత్త స్తంభాలను అమర్చారు. ఈ మేరకు రాఘవాపురంలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లాలయ్య స్తంభాలపై టీవీ కేబుల్ అమర్చే పనులకు సోమవారం సిద్ధమయ్యాడు. అయితే, స్తంభాల పక్కనే బూడిదంపాడు నుంచి ఇల్లెందు సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33 కేవీ లైన్ ఉంది. కేబుల్ వేసే పనుల్లో నిమగ్నమైన లాలయ్య పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకగా షాక్‌కు గురై పైనుంచి కిందపడ్డాడు. ఆయనను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, లాలయ్యకు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కవల కుమార్తెలు సహా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో భార్య, పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు నాగేశ్వరరావు – సరోజ చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు సీఐ సురేశ్ తెలిపారు.
రోడ్డుప్రమాదంలో..
పెనుబల్లి: మండలంలోని లంకపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన రాయల జయప్రకాష్(37) మృతి చెందాడు. ఆయన సోమవారం బైక్‌పై సత్తుపల్లి వెళ్తుండగా లంకపల్లి వద్ద జాతీయ రహదారిపై బొగ్గు టిప్పర్ ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన జయప్రకాశ్‌ను పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి డిపోలో ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వ్యాన్ డ్రైవర్...
తల్లాడ: సిగ్నల్ లైట్లు వేయకుండా నిర్లక్ష్యంగా రోడ్డుపై నిలిపిన కంటైనర్ లారీని వ్యాన్ ఢీకొనగా డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ సమీపాన చోటు చేసుకుంది. రహదారిపై లారీని డ్రైవర్ సిగ్నల్ లైట్లు లేకుండా నిలిపాడు. ఇదేమార్గంలో హుజూర్‌నగర్‌కు కొబ్బరికాయలు లోడుతో వ్యాన్ డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించక ఢీకొట్టాడు. ఘటనలో వ్యాన్ డ్రైవర్ అయిన వరంగల్ క్రిస్టియన్ కాలనీకి చెందిన కొమ్ముల బన్నిరాజు(19) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయన మృతదేహం క్యాబిన్‌లోలో ఇరుక్కుపోగా స్థానికులు సాయంతో పోలీసులు బయటకు తీశారు.
విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి


