అభ్యర్థుల్లో ఎవరు గెలుస్తారట ?!
● కూడళ్లు, టీ స్టాళ్లలో ఎడతెగని చర్చలు ● ప్రచారంపై ఆరా, గెలుపోటములపై జోస్యం
సత్తుపల్లి: ‘ఎలా ఉంది మీ వార్డులో పరిస్థితి.. ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశముంది.. ప్రచారం అయితే ఇద్దరు బాగా చేస్తున్నారు..’ఇలా మున్సిపాలిటీల్లో ఎక్కడ ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది. మిగిలిన అంశాలతో పోలిస్తే ఎన్నికల చుట్టే ముచ్చట్లు సాగుతున్నాయి. ఎవరికి వారు వార్డుల వారీగా పరిస్థితిని అంచనా వేస్తూ ఫలానా అభ్యర్థికే గెలుపు అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే, అన్నిచోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారాన్ని హోరెత్తిస్తుండడంతో గెలుపోటములపై రోజురోజుకూ అంచనాలు మారుతున్నాయి.
ప్రతీ వార్డులో సర్వేలు చేస్తున్నాం.. చాలా మంది అభిప్రాయం అడిగా.. మున్సిపాలిటీ పీఠం ఫలానా పార్టీకే వస్తుందని ఇప్పటికే ఒక అంచనా వచ్చిందంటూ కొందరు జోస్యం చెప్పేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ నేను చెప్పిందే జరిగింది.. కావాలంటే ఫలానా వాళ్లని అడగండి అని చెప్పే వారూ కనిపిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల్లా కొందరు మరో అడుగు ముందుకేసి.. ఈసారి డబ్బు ప్రభావం పని చేయదు.. ఇప్పటికే ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చారు.. అని తేల్చేస్తుండడం గమనార్హం. ఫలానా కులం, ఫలానా మతం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున వారు ఎటువైపు మొగ్గు చూపితే వారికే విజయ అవకాశాలు ఉంటాయంటూ మరికొందరు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.
పోలింగ్ సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వ్యక్తిగత ప్రచారానికే మొగ్గు చూపుతున్నారు. వార్డు వదిలి స్థానికంగానే మరోచోట ఉంటున్న వారిని కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమాన వారితో అనుబంధాన్ని గుర్తుచేస్తూ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్ చేసి పోలింగ్ రోజున తప్పక రావాలని సూచిస్తున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి – దయానంద్ దంపతులు వేర్వేరుగా వార్డులకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రతీ రోజు ఒక్కో వార్డులో ముఖ్యులను కలిసి తమ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతున్నారు.


