విత్తన, ఎరువుల డీలర్లకు శిక్షణ
ఖమ్మంవ్యవసాయం: విత్తనాలు, ఎరువుల డీలర్లకు ఆత్మ కమిటీ ఆధ్వర్యాన దేశీ (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్) శిక్షణ ప్రారంభమైంది. ఖమ్మంలోని రైతు శిక్షణా కేంద్రంలో శనివారం ఈ కార్యక్రమాన్ని ఆత్మ పీడీ, డీఏఓ ధనసరి పుల్లయ్య ప్రారంభించి మాట్లాడారు. రైతులకు నాణ్యమైన సేవలందించేలా ఇస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆత్మ ఇన్‌చార్జ్ డీడీఏ కె.వెంకటేశ్వరరావు, వైరా కేవీకే శాస్త్రవేత్తలు పావని, ఫణిశ్రీ, ఏడీఏ సతీశ్, ఏఓలు భాస్కర్‌రావు, అరుణ్‌జ్యోతి, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుప్రమాదంలో మేసీ్త్ర మృతి
● కర్మకాండలకు వెళ్లి వస్తుండగా ఘటన
తిరుమలాయపాలెం: సమీప బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లి వస్తున్న సుతారీ మేసీ్త్ర ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. మండలంలోని జల్లెపల్లికి చెందిన అన్నెపర్తి ఎల్లయ్య(48) మేసీ్త్రగా జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఆయన మరిపెడ మండలం గాలివారిగూడెంలోని సమీప బంధువుల ఇంట్లో కర్మకాండలకు వెళ్లాడు. శనివారం రాత్రి బైక్‌పై వస్తుండగా జిన్నింగ్ మిల్లు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎల్లయ్యను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. ఆయనకు భార్య సువర్ణ, కుమారుడు ఉన్నారు.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ముత్తగూడెం వద్ద సాగర్ కాల్వలో గుర్తుతెలియని మహిళ (60) మృతదేహాన్ని శనివారం గుర్తించారు. కాల్వలో కొట్టుకొచ్చి, ముళ్ల పొదల్లో చిక్కిన మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని బయటకు తీయగా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఆమె చేతికి కట్టు ఉందని, మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.


