గతుకుల రోడ్డుకు అతుకులు..
● కొత్త రోడ్డు నిర్మాణంలో ఇప్పట్లో లేనట్టే? ● ఖమ్మం – దేవరపల్లి పాత హైవేపై రూ.15 కోట్లతో పనులు ● మరమ్మతులతో వాహనదారులకు ఉపశమనం
ఖమ్మం అర్బన్: ఖమ్మం – దేవరపల్లి పాత నేషనల్ హైవేపై కొత్తగా రోడ్డు నిర్మాణం ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుపై పలుచోట్ల తారు చీలికలు ఏర్పడడమే కాక గుంతలు పడడం, కొన్నిచోట్ల ఉబ్బెత్తుగా మారడంతో ప్రయాణానికి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యాన అధికారులు బాగా దెబ్బతిన్న చోట నాలుగు రోజులుగా మరమ్మతు చేయిస్తున్నారు. దీంతో కొత్త రోడ్డు వేసే పరిస్థితులు లేవని తెలుస్తుండగా.. మరమ్మతులతో కాస్త ఉపశమనం లభించనుందని వాహనదారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మం – దేవరపల్లి మార్గంలో కొత్త హైవే అందుబాటులోకి రానుండడంతోనే మరమ్మతులతో సరిపెడుతున్నారని తెలుస్తోంది.
122 కిలోమీటర్ల పరిధి...
ఖమ్మం కరుణగిరి నుంచి దేవరపల్లి కొత్త హైవేను కలిసే జంక్షన్ వరకు సుమారు 122 కి.మీ. మేర ఈ రహదారి ఉంటుంది. ఈమేరకు దెబ్బతిన్న చోట ప్రత్యేక యంత్రాల సాయంతో రోడ్డుపై పొరను తొలగించి మళ్లీ కొత్తగా తారు వేయిస్తున్నారు. ఈ పనులను సుమారు రూ.15 కోట్లతో చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా ఖమ్మం రాపర్తి నగర్ నుంచి శ్రీశ్రీ సర్కిల్ వరకు రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చీలికలు రావడం, గుంతలతో ద్విచక్రవాహనాదారులే కాక చిన్న వాహనాల రాకపోకలకు సమస్య ఎదురవుతోంది. ఈనేపథ్యాన కొత్త రోడ్డు వేయకున్నా భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ మరమ్మతు చేయిస్తుండడం విశేషం. అంతేకాక అవసరమైన చోట కంపచెట్లు తొలగింపు, బ్లాక్ స్పాట్ల వద్ద అవసరమైన చర్యలు చేపట్టనుండడంతో రాకపోకలు సులువు కానున్నాయి. నాలుగు రోజులుగా ఖమ్మంలో ఈ పనులు చేపడుతుండగా, ట్రాఫిక్ సమస్య రాకుండా రాత్రి వేళ పనులు కొనసాగిస్తున్నారు. అయితే, రోడ్డు వెడల్పు తక్కువగా ఉన్న చోట విస్తరించడంతో పెంచడంతో పాటు మండల కేంద్రాల్లో డివైడర్లు కూడా నిర్మించాలని వాహనదారులు కోరుతున్నారు.
గతుకుల రోడ్డుకు అతుకులు..


