కష్టాలు తీరేదెన్నడు?
ఆధునికీకరణ, మరమ్మతులకు రూ.36.5 కోట్ల మంజూరు
నిధులొచ్చి ఏడాదైనా
ఆరంభం కాని పనులు
షట్టర్ల లీకేజీతో పంట చేలలోకి
చేరుతున్న నీరు
జనవరిలో అగ్రిమెంట్ ప్రక్రియ
కట్లేరు రైతుల
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం మండలానికి వరప్రదాయినిగా నిలుస్తున్న కట్లేరు ప్రాజెక్టు కింద ఐదు వేలకు ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఇక్కడ 12 గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం కట్లేరు ప్రాజెక్టు షట్టర్లు తుప్పు పట్టి మరమ్మతులకు రావడంతో నీరు కిందకు వెళ్తోంది. ఈ నీరు కోతకు వచ్చిన వరి చేన్లలో నిలిచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క ప్రాజెక్టులోని నిల్వ ఉండాల్సిన సాగునీరు వృథా అవుతుండడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదిలాగే కొనసాగితే యాసంగి పంటలకు ఇబ్బంది ఎదురవుతుందని వాపోయారు. మరో పక్క కాల్వల తూములు కూడా దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు ఎడమ, కుడి కాల్వల్లో పిచ్చిచెట్లు, చెత్తాచెదారం నిండడంతో నీరు సాఫీగా ముందుకు సాగడం లేదు.
రైతుల గోడు తీర్చేలా...
ఆయకట్టు రైతుల ప్రాజెక్టు సమస్యలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మరమ్మతుల కోసం రూ.36.5 కోట్లను ఏడాది క్రితమే మంజూరు చేశారు. ఈ నిధులతో షట్టర్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. అలాగే, 11 కి.మీ. నిడివి ఉన్న కుడి కాల్వ, పది కి.మీ. పొడవైనా ఎడమ కాల్వకు కి.మీ. మేర సిమెంట్ లైనింగ్ చేయాలని నిర్ణయించారు. రెండు కాల్వలను పటిష్టం చేయడంతో పాటు ఆరుచోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. అయితే, నిధులు మంజూరై ఏడాది దాటినా మరమ్మతు పనులు చేయకపోవడంతో ఖరీఫ్‌లో వరి సాగవుతున్న పొలాల్లోకి షట్టర్ లీకేజీల నుంచి నీరు చేరి పంట నేలరాలుతోంది. అంతేకాక వాహనాలు పొలాల్లోకి వచ్చే పరిస్థితి లేక కోతలకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే, లీకేజీలతో ప్రాజెక్టులో నీరు తగ్గుతుండగా, యాసంగి అవసరాలకు ఇక్కట్లు ఎదురవుతాయనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈమేరకు అధికారులు త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
కట్లేరు ప్రాజెక్టు ఆధునీకరణ పనుల కోసం టెండర్ ప్రక్రియ పూర్తయింది. అగ్రిమెంట్ జనవరిలో పూర్తి చేస్తాం. ప్రాజెక్టు షట్టర్లు, తూములు మరమ్మతకు వచ్చిన మాట వాస్తవమే. షట్టర్ల నుండి నీరు లీకేజీ కాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టినా ఫలితం కానరావడం లేదు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– టి.సాంబశివరావు, డీఈ, జలవనరుల శాఖ
కష్టాలు తీరేదెన్నడు?
కష్టాలు తీరేదెన్నడు?


