17ఏళ్ల అనంతరం కుటుంబం చెంతకు...
ఖమ్మంఅర్బన్: కొడుకు దూరమయ్యాడనే బెంగతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు కన్నుమూశారు. అలా 17ఏళ్లు గడిచాక ఆ వ్యక్తి కుటుంబం చెంతకు చేరగా.. చనిపోయాడని భావించిన వ్యక్తి తిరిగిరావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వివరాలు... ఈ ఏడాది ఆగస్టులో మహబూబాబాద్ జిల్లా గార్లలో మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండగా అక్కడి పోలీసులు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్‌కు అప్పగించారు. దీంతో ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఆయనకు చికిత్స చేయిస్తుండగా ఇటీవల కోలుకున్నా డు. తన పేరు షేక్ నయీం అని, మహారాష్ట్ర రాష్ట్రం అమరావతి జిల్లా చమన్‌నగర్ వాసినని చెప్పగా అక్కడి పోలీసులను సంప్రదించి వారి ద్వారా కుటుంబం ఆచూకీ తెలుసుకున్నారు. దీంతో శనివా రం నయీం అన్న షేక్‌హసన్ తదితరులు ఖమ్మం రావడంతో శ్రీని వాసరావు వారికి అప్పగించాడు. కాగా, షేక్ నయీం ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడని, పెళ్లయిన కొన్నాళ్లకే భార్య వదిలేసి వెళ్లడంతో మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు తెలిపారు. ఈక్రమాన తల్లిదండ్రులు బెంగతో కన్నుమూశారని, ఇప్పుడు అన్నం సేవా ఫౌండేషన్ చొరవతో నయీం తమకు దక్కాడని ఆయన సోదరుడు సంతోషం వ్యక్తం చేశాడు.


