స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి
● క్రిటికల్ కేంద్రాల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ ● కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కూసుమంచి/కామేపల్లి: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈమేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. రెండో విడత గ్రామపంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుండగా కూసుమంచి జెడ్పీ ఉన్నత పాఠశాల, కామేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్యోగులకు సామగ్రి పంపిణీని శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, కామేపల్లి మండలాల పరిధిలోని సర్పంచ్, వార్డుమెంబర్ స్థానాలకు పోలింగ్ జరగనుందని తెలిపారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తామని, నిర్ణీత సమయంలో ఓటర్లు కేంద్రాలకు రావాలని సూచించారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. కాగా, ఉద్యోగులు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకుని, లోటుపాట్లు, గందరగోళానికి తావివ్వకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల అధికారులు వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అవసరమైతే సూచనలు చేస్తారని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగానే రెండు గంటలకు లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలు వెల్లడించాలని, ఆతర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో మండలాల ప్రత్యేక అధికారులు ఎం.వీ.మధుసూదన్, శ్రీలత, ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ బి. నివాసులు, తహసీల్దార్లు సుధాకర్, రవికుమార్, ఎంపీడీఓలు రవీందర్, జశ్వంత్‌కుమార్, ఎంఈఓ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


