నెమ్మదిగా రోప్‌వే పనులు
● ఇంకా లోయర్ స్టేషన్ దగ్గరే కసరత్తు ● పూర్తి కావడానికి రెండేళ్లకు పైగా సమయం
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం పర్యాటక రంగంలో కలికితురాయిగా నిలుస్తుందని భావిస్తూ ఖిల్లాపైకి చేపడుతున్న రోప్ వే నిర్మాణ పనులు ఆలస్యమయ్యే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్నరలోగా రోప్‌వే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా రెండేళ్లు, అంతకు మించి సమయం పడుతుందని తెలుస్తోంది. రోప్‌వే నిర్మాణం, ఖిల్లాపై సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ రూ.29 కోట్లు కేటాయించగా, ఇందులో రోప్ వే నిర్మాణానికి రూ.15 కోట్లు వెచ్చించనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు కోల్‌కత్తాకు చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకుని ఇటీవల మొదలుపెట్టాడు. కానీ లోయర్ స్టేషన్ ప్రతిపాదిత ప్రాంతం నుంచి అడుగు ముందుకు పడకపోవడం, ఇక్కడే పనులకు మరో నెల పట్టే అవకాశముండగా మొత్తం పనుల్లో ఆలస్యం జరిగే అవకాశముందని భావిస్తున్నారు.
236 మీటర్ల మేర రోప్‌వే
ఖిల్లా కింది భాగం నుంచి పైవరకు 236 మీటర్ల మేర రోప్‌వే నిర్మాణానికి ప్రతిపాదించారు. అయితే, లోయర్ స్టేషన్ నిర్మించే ప్రాంతంలో ఇళ్లు ఖాళీ చేయించాల్సి రావడం, అక్కడ చాలా లోతు వరకు రాళ్లు ఉండడంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. లోయర్ స్టేషన్ నిర్మించాక ఇతర పనులు వేగంగా జరుగుతాయని చెబుతున్నా ప్రభుత్వం విధించిన 18నెలల గడువులోగా పూర్తవడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాళ్ల తవ్వకాలు పూర్తి కాగానే లోయర్ స్టేషన్ నిర్మిస్తామని, ఆపై అప్పర్ స్టేషన్ నిర్మాణం, రోప్‌వే ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తామని అధికారులు చెబుతున్నారు.
నాలుగు క్యాబిన్లు.. పైన పార్క్‌లు
రోప్‌వే నిర్మాణంలో భాగంగా నాలుగు క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో రెండు పైకి, మరో రెండు కిందకు రాకపోకలు సాగిస్తాయి. అంతేకాక ఖిల్లాపై పిల్లలు, పెద్దలు సేదతీరేలా ఆధునాతనహోటల్, వాటర్ షౌంటెన్లు, అమ్యూజ్‌మెంట్ పార్క్, మినీ థియేటర్, ఆట పరికరాలు ఏర్పాటుచేయనున్నారు. అంతేకాక విజ్ఞానం పెంపొందించేలా మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదించారు. రోప్‌వే పూర్తయితే ఖమ్మం ఖిల్లా పర్యాటక ప్రాంతంగా మారనున్నందున పనులు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
నెమ్మదిగా రోప్‌వే పనులు


