విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
● అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి
ఖమ్మం అర్బన్: విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. వరదలు, పరిశ్రమలు, ఇతర ప్రమాదాల నియంత్రణపై జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాహల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు వచ్చినప్పుడు, పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై నమూనా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ వీసీకి కలెక్టరేట్ నుంచి హాజరైన అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆతర్వాత అధికారులతో సమావేశమయ్యారు. జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సూచనలు, గత అనుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు నకుల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ ఫేర్‌ను
విజయవంతం చేద్దాం
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం బల్లేపల్లిలోని ఎస్‌ఎఫ్‌ఎస్ హైస్కూల్‌లో ఈనెల 20, 21వ తేదీల్లో జరిగే జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌ను జయప్రదం చేసేలా అందరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీ సూచించారు. సైన్స్ మ్యూజియంలో శుక్రవారం జరిగిన సన్నాహాక సమావేశంలో ఆమె మాట్లాడుతూ కమిటీల కన్వీనర్లు, సభ్యులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. విద్యార్థులు తమ ఎగ్జిబిట్ల వివరాలను గూగుల్ ఫాం ద్వారా ఈనెల 18వ తేదీ రాత్రి వరకు పంపించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమావేశంలో కోఆర్డినేటర్ రామకృష్ణ, ఏఎంఓ పెసర ప్రభాకర్‌రెడ్డి, సీఎంఓ ప్రవీణ్ కుమార్, జీసీడీఓ రూబీ, డీసీఈబీ సెక్రటరీ కనపర్తి వెంకటేశ్వర్లు, ఎంఈఓలు శైలజలక్ష్మి, శ్రీనివాసరావు, రాములు, వెంకటేశ్వర్లు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదులో పాలుపంచుకోవాలి
ఖమ్మం సహకారనగర్: టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదులో అందరూ చురుగ్గా పాల్గొనాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కొణిదన శ్రీనివాస్ సూచించారు. ఖమ్మంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. సభ్యత్వ నమోదును విజయవంతం చేయడంతో పాటు 2026 డైరీ రూపకల్పనలో పాలుపంచుకోవాలని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేయడంతో పాటు ఈహెచ్‌ఎస్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. నాయకులు జెడ్.ఎస్.జైపాల్, విజయ్ కుమార్, గంగవరపు బాలకృష్ణ, కొమరగిరి దుర్గాప్రసాద్, వల్లపు వెంకన్న, ఎస్.లలితకుమారి, ఎస్.రాధికారెడ్డి, తాళ్లూరి శ్రీకాంత్, భూసా చంద్రశేఖర్, హరికృష్ణ కోణార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకనకదుర్గమ్మకు
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మ వారికి శుక్రవారం వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆలయంలో అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతిని అర్చకులు సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు పాల్గొన్నారు.
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
విపత్తుల నిర్వహణకు పటిష్ట ప్రణాళిక


