ఒక్కో తీరు | - | Sakshi
Sakshi News home page

ఒక్కో తీరు

Dec 13 2025 7:52 AM | Updated on Dec 13 2025 7:52 AM

ఒక్కో తీరు

ఒక్కో తీరు

తొలి విడత ఎన్నికలపై పార్టీ,

వ్యక్తిత్వం, డబ్బు ప్రభావం

మెజార్టీ సర్పంచ్‌లు కాంగ్రెస్‌కు దక్కినా వెలితే..

కొన్నిచోట్ల ‘అధికార’ పార్టీ

రెబల్స్‌ తీరుతో ప్రతిపక్షాలకు విజయం

కలిసి పోటీచేసి పట్టు నిలుపుకున్న బీఆర్‌ఎస్‌, సీపీఎం

ఒక్కోచోట..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడతలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ మద్దతుదారులకు దక్కినా.. ఒక్కో పంచాయతీలో ఒక్కో తీరుగా ఫలితాలు వెలువడ్డాయి. పార్టీ ప్రభావం, సానుభూతి, అభ్యర్థుల వ్యక్తిత్వం, డబ్బు పంపిణీ తదితర అంశాలు ఫలితాలను తారుమారు చేశాయి. మెజార్టీ పంచాయతీల్లో కాంగ్రెస్‌ గెలవడానికి అధికారం ‘చేతి’లో ఉండడమే కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే, స్థానిక కుంపట్లతో ఆ పార్టీ పలు పంచాయతీలను కోల్పోగా.. ఇంకొన్నిచోట్ల రెబల్స్‌ విజయఢంకా మోగించారు.

వైరాలో కాంగ్రెస్‌ సత్తా చాటి..

వైరా నియోజవకర్గంలో వైరా, కొణిజర్ల మండలాల్లో 49పంచాయతీలకు గాను 38 చోట్ల కాంగ్రెస్‌, నాలుగు బీఆర్‌ఎస్‌, రెండు సీపీఎం, ఒకటి సీపీఐ మద్దతుదారులు గెలవగా..ఇతరులు నాలుగు పంచాయతీల్లో పాగా వేశారు. మధిర నియోజకవర్గంలోని మండలాలతో పోలిస్తే వైరా, కొణిజర్ల మండలాల్లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. వైరాలో 22పంచాయతీలకు ఏకంగా 20 పంచాయతీలు కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం 37పంచాయతీలకు గాను ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్‌ 26 పంచాయతీలను కై వసం చేసుకోగా బీఆర్‌ఎస్‌ 11 పంచాయతీలను దక్కించుకుంది. మూడు పంచాయతీలను బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు తక్కువ మెజార్టీతో కోల్పోయారు.

సానుభూతితో భారీ మెజార్టీ

చింతకాని మండలం పాతర్లపాడు జీపీలో 12వార్డులకు గాను బీఆర్‌ఎస్‌ మద్దతుతో సీపీఎం బలపరిచిన అభ్యర్థులు 11వార్డులు గెలుచుకున్నారు. సర్పంచ్‌ అభ్యర్థిగా సీపీఎం మద్దతు తెలిపిన ఓబినబోయిన లక్ష్మి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ మద్దతుదారురాలు బొర్రా ఉమపై 567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఈ గ్రామానికి చెందిన సీపీఎం నేత సామినేని రామారావు హత్యకు గురయ్యాడు. ఈ హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. సీపీఎం మద్దతుదారులు ఇంత మెజార్టీతో గెలవడానికి రామారావుపై ఉన్న సానుభూతే కారణమన్న చర్చ జరుగుతోంది. గతంలో పలుమార్లు సీపీఎం ఈ గ్రామపంచాయతీని దక్కించుకున్నా ఇన్ని వార్డులు గెలవలేదు.. ఇంత మెజార్టీ రాలేదు.

పోటాపోటీ

చింతకాని మండంలోని ఓ పంచాయతీలో ఒక అభ్యర్థి ఓటుకు రూ.7,500, మరో పంచాయతీలో రూ.5 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరిగింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఓటుకు ఎంత ఇచ్చాడో తెలుసుకుని అంతకన్నా ఎక్కువ ఇచ్చేలా ఇక్కడి అభ్యర్థులు పోటీ పడినట్లు సమాచారం. ఎర్రుపాలెం మండలంలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు ఐదు పంచాయతీల్లో విజయం సాధించారు. ఈ అభ్యర్థులకు ‘స్థానికం’గా బలం ఉండడంతో వీరి గెలుపు సాధ్యమైందన్న రాజకీయ చర్చ జరుగుతోంది. మొదటి విడతలో జనరల్‌కి రిజర్వ్‌ అయిన పలు పంచాయతీల్లో ఓటరుకు డబ్బు పంపిణీ పోటాపోటీగా చేసినట్లు తెలుస్తోంది.

తక్కువ ఓట్లు.. వర్గపోరు

కాంగ్రెస్‌ పార్టీలో స్థానిక నేతల మధ్య వర్గపోరుతో పలు పంచాయతీలను తక్కువ ఓట్లతో కోల్పోవడం, మరికొన్ని పంచాయతీల్లో ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులకు ఎక్కువ మెజార్టీ తెచ్చిపెట్టాయన్న ప్రచారం జరుగుతోంది. బోనకల్‌ మండలంలోని ఆళ్లపాడు, లక్ష్మీపురం పంచాయతీలు తక్కువ ఓట్లతో కాంగ్రెస్‌ కోల్పోయింది. అలాగే మధిర మండలంలోని బయ్యారంలో రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ బయటపడింది. ఎర్రుపాలెం మండలంలో పలు పంచాయతీల్లో కాంగ్రెస్‌ రెబల్స్‌ పోటీ చేశారు. ఇందులో కొన్ని కాంగ్రెస్‌ మద్దతుదారులు, ఇంకొన్ని రెబల్స్‌ గెలిచినా మెజార్టీపై మాత్రం ప్రభావం చూపింది. బోనకల్‌ మేజర్‌ గ్రామపంచాయతీని అత్యధికంగా 960 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుదారురాలు బానోతు జ్యోతి దక్కించుకుంది. ఇక్కడ 3,770 ఓట్లకు 3,406 ఓట్లు పోలయ్యాయి. ఈ పంచాయతీలో కాంగ్రెస్‌ వర్గ పోరు ఆ పార్టీ మద్దతుదారుల ఓటమికి కారణమైనట్లు సమాచారం. కాంగ్రెస్‌ నుంచి ముందు రెబల్స్‌ నామినేషన్లు వేసి ఎవరికి వారు తామే బరిలో ఉంటామని ప్రచారం చేసుకున్నారు. అయితే, నాయకులు, అభ్యర్థులు నచ్చచెప్పడంతో ఉపసంహరించుకున్నా ఆ తర్వాత పట్టనట్లు ఉన్నారు. దీంతో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు భారీ మెజార్టీతో గెలవగా, కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారురాలిగా బరిలో నిలిచిన భూక్యా మంగమ్మ ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement