ముక్కోటి పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలంలో ఈనెల 29, 30వ తేదీల్లో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల వాల్ పోస్టర్లను భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, ఉత్తరద్వార దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు పూర్తి సమాచారం తెలిసేలా రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు అంటిస్తామని తెలిపారు. సౌకర్యాల కల్పపై ఈనెల 15న భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో డివిజన్‌స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ దామోదర్‌రావు, అర్చకులు పాల్గొన్నారు.
స్వర్ణకవచధారణలో రామయ్య
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవా రుజామున గర్భగుడిలో స్వామికి సుప్రభాత సే వ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం తదితర పూజలు చేశారు.


