విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
ఖమ్మంక్రైం: ఎన్నికలు జరిగే మండలాల్లో 163 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఈమేరకు ఆయా మండలాల్లో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న మండలాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించి భద్రతపై ఉద్యోగులకు సూచనలు చేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ రెండో విడత గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాక 77 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అడిషనల్ డీసీపీ స్దాయి అధికారులతో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. కాగా, డబ్బు, మద్యం ప్రభావాన్ని నియంత్రించేలా చేపట్టిన తనిఖీల్లో రూ.22లక్షల నగదు, రూ.12లక్షల విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. అలాగే, 1,059 కేసుల్లో 7,129మందిని బైండోవర్ చేశామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు నాయకులు సహకరించాలని సూచించారు.
పోలీసు కమిషనర్ సునీల్‌దత్


