శ్రీవారికి ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయ ఆవరణలోని స్వామివారి పాదం, మూలవిరాట్‌కు పంచామృతంతో వేదమంత్రాల నడుమ అభిషేకాలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన కల్యాణం నిర్వహించారు. ఆతర్వాత పల్లకీ సేవ నిర్వహించగా భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు నెట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: సీనియర్స్ విభాగంలో ఉమ్మడి జిల్లాస్థాయి పురుషులు, మహిళల నెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు ఆదివారం జరగనున్నాయి. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో ఈ పోటీలు జరుగుతాయని నెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎన్.ఫణికుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డు వెంట తీసుకుని ఉదయం 9గంటలకు రిపోర్టు చేయాలని సూచించారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గం
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ డేటా ఎంట్రీ ఆపరేటర్ల నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. ఖమ్మంలో నిర్వహించిన కమిటీ సమావేశంలో మూడేళ్ల కాలానికి ఈ ఎన్నిక జరిగింది. కమిటీ అధ్యక్షుడిగా ఆర్.సంపత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పి.ఉపేందర్, కోశాధికారిగా ఏ.రాము, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకాష్ ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా సురేష్, భార్గవ్, సీహెచ్.ప్రభుకిషోర్, సంయుక్త కార్యదర్శులుగా ప్రభుదాస్, కె.కవిత, ప్రియ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ఉమాశంకర్, లోకేష్, వసంత్, ప్రచార కార్యదర్శిగా ఎస్.డీ.గౌసియాబేగం, కార్యవర్గ సభ్యులుగా ఝాన్సీ, సంధ్య, కౌసల్య ను ఎన్నుకున్నారు.
‘నవోదయ’ ప్రవేశ పరీక్షకు 2,995మంది హాజరు
కూసుమంచి: ఖమ్మం జిల్లా పాలేరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం శనివారం పరీక్ష నిర్వహించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఎనిమిది చొప్పున, ములుగు జిల్లా వెంకటాపురంలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటుచేయగా 3,737 మంది విద్యార్థులకు 2,995మంది హాజరయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీఈఓ, సింగరేణిలోని పరీక్షా కేంద్రాన్ని పాలేరు విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తనిఖీ చేశారు.


